యూట్యూబ్ లో టి20 ప్ర‌పంచ క‌ప్..! అదికూడా భార‌త్ మ్యాచ్!

అస‌లే ఇది డిజిట‌ల్ యుగం. ఏ త‌ప్పు జ‌రిగినా నెటిజ‌న్లు చిటికెలో ప‌ట్టేసే కాలం. ఇక ఐసీసీ చేసిన పొర‌పాటును చూస్తూ ఊరుకుంటారా?;

Update: 2026-02-28 03:42 GMT

అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్, ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)ల‌లో కొన్ని సెక‌న్ల అడ్వ‌ర్ట‌యిజ్మెంట్ ప్ర‌సారానికి రూ.కోట్లు వ‌సూలు చేస్తాయి బ్రాడ్ కాస్టింగ్ కంపెనీలు. అస‌లు ఈ రైట్స్ కోస‌మే కొన్ని వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాయి కూడా. త‌మ ఫీడ్ ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాయి. కానీ, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టి20 ప్ర‌పంచ క‌ప్ లో అనూహ్యంగా దాదాపు అరగంట‌కు పైగా మ్యాచ్ ప్ర‌సార‌మైంది. అదికూడా ఏదో విదేశీ జ‌ట్ల‌ది కాదు. టోర్నీ ఆతిథ్య దేశ‌మైన భార‌త్... జింబాబ్వేతో త‌ల‌ప‌డిన మ్యాచ్. సూప‌ర్ 8లో తొలి మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాతో అనూహ్యంగా ఓడిన టీమ్ఇండియాకు జింబాబ్వే మ్యాచ్ కీల‌కంగా మారింది. ఇందులో భారీ విజ‌యం సాధించాల్సిన ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో మ్యాచ్ లైవ్ సామాజిక మాధ్య‌మం యూట్యూబ్ లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సార‌మైంది. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం అభిమానుల వంతైంది. అవాక్క‌వ‌డం టోర్నీ అఫీషియ‌ల్ బ్రాడ్ కాస్ట‌ర్ జియో హాట్ స్టార్-స్టార్ స్పోర్ట్స్ నెట్ వ‌ర్క్ ప‌న‌యింది.

అచ్చు త‌ప్పు కాదు డిజిట‌ల్ ఎర్ర‌ర్

అచ్చు త‌ప్పు అనేది అక్ష‌రాలు అటుఇటు అయితే చెప్పుకొనే మాట‌. కానీ, భార‌త్-జింబాబ్వే మ్యాచ్ విష‌యంలో డిజిట‌ల్ ఎర్ర‌ర్ జ‌రిగింది. చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో గురువారం జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పెద్ద పొర‌పాటే చేసింది. ఈ మ్యాచ్ లోని మొద‌టి ఏడు ఓవ‌ర్లు ఐసీసీ అధికారిక యూట్యూబ్ చాన‌ల్ లో లైవ్ వ‌చ్చాయి. అంటే.. తొలుత‌ బ్యాటింగ్ చేసిన భార‌త ఇన్నింగ్స్ లోని అత్యంత కీల‌క‌మైన‌, బ్యాట్స్ మెన్ విరుచుకుప‌డే ప‌వ‌ర్ ప్లే (6 ఓవ‌ర్లు)తో పాటు మ‌రో ఓవ‌ర్ కూడా టెలికాస్ట్ అయిపోయాయ‌న్న మాట‌.

ఆడేసుకున్న నెటిజ‌న్లు..

అస‌లే ఇది డిజిట‌ల్ యుగం. ఏ త‌ప్పు జ‌రిగినా నెటిజ‌న్లు చిటికెలో ప‌ట్టేసే కాలం. ఇక ఐసీసీ చేసిన పొర‌పాటును చూస్తూ ఊరుకుంటారా? ఈ ఏడు ఓవ‌ర్ల లైవ్ క్లిప్ ల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టేశారు. ఇది చూసి మిగతా అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు. కొంద‌రు అభిమానులు పాజిటివ్ గానే స్వీక‌రించినా.. మ‌రికొంద‌రు మాత్రం ఐసీసీ టోర్నీలో, అది కూడా భార‌త్ లో జ‌రుగుతుండ‌గా, భార‌త మ్యాచ్ ఇలా ఐసీసీ యూట్యూబ్ చాన‌ల్ లో లైవ్ రావ‌డం స‌రికాద‌నే విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఇది నిర్వ‌హ‌ణ లోపం కింద‌కు వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు.

సాంకేతిక లోప‌మా?

భార‌త్-జింబాబ్వే మ్యాచ్ విష‌యంలో జ‌రిగిన‌ది టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ గా భావిస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ షెడ్యూల్ లోపాలూ కార‌ణ‌మే అన్న వాద‌న వినిపిస్తోంది. ఏదేమైనా.. ఈ ఉదంతం డిజిట‌ల్ ప్ర‌సారాల గోప్య‌త‌ను ప్ర‌శ్నార్థ‌కం చేసింది. దీనిపై ఐసీసీ మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌కుండా గ‌మ్మునుంది.

Tags:    

Similar News