గవర్నర్ కు టీతమ్ముళ్ల ఘోష

Update: 2016-07-12 09:37 GMT
తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లు మరోసారి రాజ్ భవన్ బాట పట్టారు. తమకు జరిగిన అన్యాయంపై మీడియా ముందు వాపోయిన వారు.. తాజాగా గవర్నర్ దృష్టికి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఫలితం ఉన్నా లేకున్నా.. కొన్ని విషయాల్ని రాజకీయ నేతలు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. అధికారపక్షం కారణంగా తమకుజరిగిన అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లటం ఒకటిగా చెప్పొచ్చు.

నిజానికి దీని వల్ల విపక్షానికి ఏదైనా ప్రయోజనం ఉంటుందా? అంటే.. అలాంటిదేమీ ఉండదన్న విషయం అందరికి తెలిసిందే. కాకుంటే.. కాస్తంత హడావుడి చేయటానికి.. మీడియాలో మరోసారి కనిపించటానికి మాత్రమే ఇలాంటివి పనికి వస్తాయని చెప్పాలి.  గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో తెలంగాణ.. ఏపీకి చెందిన విపక్షాలు గవర్నర్ ను తరచూ కలవటం.. ఫిర్యాదులు ఇవ్వటం.. ఆయన చూస్తామనటం.. ఫిర్యాదు చేసిన వారు వెనక్కి రావటం తెలిసిందే.

తాజాగా అలాంటి ఎపిసోడే మరొకటి చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో తమకు కేటాయించిన గదులను.. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వేరే వారికి కేటాయించారని.. అలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ.. తెలంగాణ స్పీకర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ తెలుగుదేశం నేతలు గవర్నర్ ముందు తమ వాదన వినిపించి.. వినతిపత్రం ఇచ్చారు. ఎప్పటిలానే గవర్నర్ చేతికి ఒక వినతిపత్రం ఇవ్వటం..తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పటం.. వారి మాటల్ని విని.. తాను చూస్తానన్న మాట గవర్నర్ నోటి నుంచి రావటం.. ఆపై తమ్ముళ్లు తిరిగి రావటం లాంటివి మరోసారి చోటు చేసుకున్నాయి.రానున్న రోజుల్లో ఇలాంటివే మరెన్ని చోటు చేసుకుంటాయో..?
Tags:    

Similar News