ఉద్యోగులకు 400 ఫ్లాట్లు.. 1260 కార్లు

Update: 2016-10-28 04:49 GMT
నాలుగు రూపాయిలు వెనకేసుకోవటం ప్రపంచంలో ప్రతి ఎదవా చేసే పనే. కానీ.. తాను సంపాదించిన సంపాదన వెనుక ఉద్యోగి కష్టం ఉందని పూర్తిగా నమ్మేవారు కొందరు ఉంటారు. నమ్మకంతోనే సరిపెట్టకుండా.. తనకొచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని తీసి మరీ ఖర్చు చేసే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఒకవేళ ఇచ్చినా.. అరకొరగా ఏదో నాలుగు పైసలు అన్నట్లుగా ఇచ్చే వారు కొందరైతే.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. ఉద్యోగుల శ్రేయస్సే తన లక్ష్యమన్నట్లుగా వ్యవహరించే వజ్రం లాంటి యజమానులు చాలా.. చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వజ్రం లాంటి జయమాని ‘‘సావ్ జీ ఢోలకియా’’. హరే కృష్ణ ఎక్స్ పోర్ట్స్ పేరిట వజ్రాల వ్యాపారం నిర్వహించే ఆయన కంపెనీకి వేలాది కోట్ల ఆదాయం వస్తుంది. అయితే.. దానికి కారణం ఉద్యోగులని మనస్ఫూర్తిగా నమ్మే ఆయన.. దీపావళి సందర్భంగా ఖరీదైన బహుమతుల్ని ఇచ్చి ఉద్యోగుల్నే కాదు.. దేశ వ్యాప్తంగా ప్రజల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంటారు. 2011 నుంచి ఇలా ఖరీదైన బహుమతుల్ని ఇచ్చే ఆయన తాజా దీపావళి సందర్భంగా మరోసారి భారీ బహుమతుల్ని ఉద్యోగులకు ఇచ్చి ‘వజ్రం’లాంటి యజమానిగా అందరి మన్ననలు పొందుతున్నారు.

గత ఏడాది దీపావళి బోనస్ కింద 491 కార్లు.. 200 ఫ్లాట్లు ఇచ్చిన ఆయన.. ఈ ఏడాది అంతకుమించిన బహుమతుల్ని ప్రకటించారు. తాజా దీపావళి బోనస్ ను ప్రకటించిన ఆయన.. తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగుల్లో బాగా పని చేసిన ఉద్యోగుల్లో 400 మందికి ఫ్లాట్లు.. 1260మందికి కార్లు ప్రకటించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇతర బహుమతుల కింద మరో వంద మందిని ఎంపిక చేశారు. మొత్తంగా 1716 మందిని భారీ బహుమతులకు ఎంపిక చేసినట్లుగా సదరు కంపెనీ ప్రకటించింది. ఈ యజమాని గురించి మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. సినిమా సన్నివేశాల్లో మాదిరి.. వేలాది కోట్ల కంపెనీకి వారసుడైన తన కుమారుడికి రూ.7వేలు చేతికి ఇచ్చి.. తన పేరు చెప్పకుండా బతకాలని.. సొంతంగా సంపాదించాలని చెప్పి.. డబ్బు విలువ తెలిసేలా చేసి ఆ మధ్య వార్తల్లోకి వచ్చింది ఈయనే. ఇలాంటి యజమానులు మనకూ ఉంటే ఎంత బాగుండని అనిపిస్తుంది కదూ..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News