అంత సంతోషంలోనూ ప్రత్యర్థిని వదిలిపెట్టని అమ్మ

Update: 2016-05-24 04:45 GMT
తమిళనాట రాజకీయాల్లో ప్రత్యర్థుల పట్ల రాజకీయ అధినేతలు ఎంత కటువుగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ లేనప్పుడు తాము పడిన అవమానాలకు లెక్క కట్టి మరీ చుక్కలు చూపించటం కొత్త విషయం ఏమీ కాదు. కాకుంటే..ఈసారి అలాంటివి ఉండవన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. తాను ముఖ్యమంత్రి అయితే.. జయలలిత మీద ఎలాంటి వేధింపు చర్యలు ఉండవని.. ఆమె మీద రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకోమన్న రీతిలో డీఎంకే అధినేత కరుణానిధి వ్యాఖ్యానించటం తెలిసిందే.

కరుణ నోట వెంట అలాంటి మాటలు రావటం ఆసక్తిని రేకెత్తించాయి. సార్వత్రిక ఎన్నికల్లో పవర్ పక్కా అని అనుకుంటున్న అధినేత నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యల నేపథ్యంలో.. తమిళ రాజకీయాల రంగు మారుతుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అలాంటివేమీ లేదన్న విషయాల్ని తన చేతలతో తేల్చేశారు అన్నాడీఎంకే అధినేత్రి.. ఆరుసార్లు ముఖ్యమంత్రి అయిన జయలలిత. ప్రత్యర్థి ఎలా ఉన్నా.. తాను మాత్రం మారనే మారనన్న విషయాన్ని తన ప్రమాణస్వీకారం రోజునే స్పష్టం చేశారు.

30 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జయలలిత ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు డీఎంకే సీనియర్ నేత స్టాలిన్. అమ్మ ప్రమాణస్వీకారానికి స్టాలిన్ రావటం ఒక విశేషమైతే.. అలా వచ్చిన స్టాలిన్ ను తగు మర్యాద చేసి పంపేందుకు అమ్మ ససేమిరా అనటమే కాదు.. తానేంటో మరోసారి స్పష్టం చేశారు. మరో విపక్ష నేత శరత్ కుమార్ కు మొదటి వరుసలో కుర్చీ వేసి అమ్మ.. తమిళనాడు అసెంబ్లీలో 89 సీట్లున్న డీఎంకే పార్టీ ముఖ్యనేతకు మాత్రం రెండో వరుసలో సీటు వేయటం గమనార్హం.

అమ్మ ప్రమాణస్వీకారానికి వెళ్లిన తమ నేతను ఇంతలా అవమానిస్తారా? అంటూ తొంభైమూడేళ్ల కరుణానిధి తీవ్రంగా ఆక్షేపించారు. తన కుమారుడ్ని తీవ్రంగా అవమానించారని ఆయన విమర్శించారు. ప్రజలు తనకిచ్చిన గెలుపుతో మాటలు రావటం లేదన్న జయలలిత.. ప్రత్యర్థుల విషయంలో మాత్రం తన లెక్క మారలేదన్న విషయాన్ని ప్రమాణస్వీకారోత్సవం రోజునే స్పష్టం చేశారని చెప్పాలి.
Tags:    

Similar News