కాళేశ్వరం ప్రాజెక్టుకు చిన్నతరహా ప్రాజెక్టులు బలి!

Update: 2019-06-16 13:42 GMT
తెలంగాణలో ప్రభుత్వం - మరికొన్ని వర్గాలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.. ఈ నెల 21న నీటి విడుదల చేయనున్న సందర్భంగా ఇతర రాష్ట్ట్రాల ముఖ్యమంత్రులనూ పిలిచి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించబోతున్నారు. కేవలం మూడేండ్లలోనే నిర్మించి చరిత్ర సృష్టించామంటూ తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. ఇవన్నీ నిజమే కావొచ్చు... కాళేశ్వరం ప్రాజెక్టు లక్షలాది ఎకరాలను తడిపి లక్షలాది మంది రైతుల బతుకులను బాగుచేసే సామర్థ్యం ఉన్నదే కావొచ్చు. ఇందులో ఎవరికీ అనుమానాలు లేవు. కానీ... ఈ ప్రాజెక్టుపై చూపుతున్న శ్రద్ధ మిగతా సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చూపడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది. కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా చిన్నతరహా ప్రాజెక్టులను పూర్తిగా గాలికొదిలి కాళేశ్వరం వంటివి పూర్తి చేసి ప్రభుత్వం ప్రచారం చేసుకుకంటోందని.. నీరు అన్ని జిల్లాలకు కావాలని ప్రజలు అంటున్నారు.

ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఇలాంటి మాటలు - అసంతృప్తి వినిపిస్తున్నాయి. మహబూబ్‌ నగర్ - నారాయణపేట జిల్లాలకు సాగు - తాగునీటిని అందించే మధ్యతరహ ప్రాజెక్టు కోయిల్‌ సాగర్ నిర్వహణపై కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా శీతకన్ను వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా ప్రాజెక్టు నిర్వహణ పనులకు నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికి చిల్లి గవ్వయినా విడుదల చేయడం లేదని ఆ జిల్లాల ప్రజలు అంటున్నారు.

ప్రాజెక్టు వద్ద కనీసం లైట్లు కూడా వెలగడం లేదట. ప్రాజెక్టుపై పర్యటకులు నడిచి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన నడక దారి గుంతలమయమైంది. ప్రాజెక్టు వద్ద కనీస మరమ్మత్తులు చేపట్టేందుకు సైతం నిధులు లేకపోవడంతో నిర్వహణ బారంగా మారింది. కోయిల్‌ సాగర్ జలాశయం మహబూబ్‌ నగర్ - నారాయణపేట జిల్లాలోని దేవరకద్ర - చిన్నచింతకుంట - ధన్వాడ - మరికల్ మండలాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు నారాయణపేట - కొడంగల్ - మండలాల్లోని గ్రామాలు - మహబూబ్‌ నగర్ పట్టణానికి తాగునీటి అవసరాలు తీరుస్తోంది. జూన్ నెల చివరిలో జూరాల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులోకి నీటిని తరలించే అవకాశం ఉంటుంది. నీటిపారుదల శాఖ అధికారులు ఆలోపు ప్రాజెక్టు వద్ద నిర్వహణ పనులకు చర్యలు తీసుకోవాలి. జూన్ నెలలో రెండు వారాలు పూర్తి అయినా అధికారులు కనీసం స్పందించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News