హైదరాబాద్ లోని ఆ '7' ప్రాంతాలు హీట్ మైన్స్!

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా.. రాత్రి 11 గంటల వేళలోనే హైదరాబాద్ వాతావరణం వేడిగా ఉండటంతో నిప్పుల కొలిమిలా మారిన పరిస్థితి.

Update: 2024-05-07 05:30 GMT

అన్ని సమ్మర్లు ఒకేలా ఉండవన్నట్లుగా.. ఈసారి వేసవి మంట మండిస్తోంది. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే ఎండ.. అంతకంతకూ పెరిగిపోవటం.. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఈసారి సమ్మర్ సగటు వేసవి కంటే మూడు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న అంచనాలు అక్షర సత్యం కావటం తెలిసిందే. గడిచి రెండు వారాలుగా కాసిన ఎండలతో హైదరాబాదీయులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా.. రాత్రి 11 గంటల వేళలోనే హైదరాబాద్ వాతావరణం వేడిగా ఉండటంతో నిప్పుల కొలిమిలా మారిన పరిస్థితి.

దీంతో.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ఇబ్బందులకు పడుతున్న పరిస్థితి. చాలామంది ఎండ వేళలో బయటకు రాకుండా ఉండిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ అర్బన్ ల్యాబ్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమికి నకళ్లుగా ఉండటం కనిపిస్తుంది. హీట్ ఐలాండ్స్ గా మారిన ఏడు ప్రాంతాల్ని గుర్తించారు.

గడిచిన కొంతకాలంగా హైదరాబాద్ లో పెరిగిన నగరీకరణ.. పెద్ద ఎత్తున చెట్లు కొట్టేయటం.. నగరాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చేయటంతో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శాటిలైట్ల సమాచారాన్ని.. గూగుల్ ఎర్త్ లో నమోదైన ఉష్ణోగ్రతల సమాచారం ఆధారంగా హైదరాబాద్ మహానగరంలో ఏడు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో..

Read more!

- మైలార్ దేవ్ పల్లి

- బీఎన్ రెడ్డి నగర్

- మన్సూరాబాద్

- పటాన్ చెర్వు

- బండ్ల గూడ

- గచ్చిబౌలి

- హయత్ నగర్

ఈ ఏడు ప్రాంతాలు.. హైదరాబాద్ మహానగరంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ వేడిగా ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నేల మీద నిలవలేనంతగా భూమి వేడెక్కినట్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో భూమి మీద ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తుననారు. చెట్లను భారీ ఎత్తున పెంచి పచ్చదనాన్ని విస్తరిస్తే తప్పించి.. పెరిగే ఈ ఉష్ణోగ్రతల్ని తగ్గించలేమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. ఈ ఏడు ప్రాంతాల్లో నివిస్తున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి.

Tags:    

Similar News