కేసీఆర్ అరెస్టుకు మోడీ ప్లాన్ చేశారా?

అధికారం చేజారిన నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహా చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

Update: 2024-05-07 05:15 GMT

అధికారం చేజారిన నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం మినహా ఆయన పార్టీ పెద్దగా సాధించేది ఉండదన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి మాటలకు బ్రేకులు వేయాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్.. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కనీసం పది స్థానాల్ని సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నారు. అయితే.. ఆయన ఎంతగా తపించినా మహా అయితే మూడు నాలుగుకు మించి రావని.. అవి రావటం కూడా సామాన్య విషయం కాదన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేయటమే కాదు.. వ్యూహాత్మకంగా కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

తాజాగా అలాంటి ఇంటర్వ్యూ ఒకటి.. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నించారని.. కానీ సాధ్యం కాలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లొంగకుండా ఉన్న వ్యక్తులు దేశంలో ముగ్గురు..నలుగురు ఉన్నట్లుగా చెప్పిన కేసీఆర్.. ఆ జాబితాలో తాను.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. హేమంత్ సోరెన్ తో పాటు మరొకరు ఉన్నారన్నారు. తమను జైల్లో పెట్టేందుకు ప్రధాని మోడీ చాలానే ప్రయత్నాలు చేశారని.. కాకుంటే తాను ఎలాంటి తప్పులు చేయలేదు కాబట్టి దొరకలేదన్నారు.

Read more!

తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమ్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ శపధం చేశారని.. కానీ రేవంత్ ఇప్పుడు తోక ముడిచారన్నారు. తాము అత్యధిక ఎంపీ స్థానాల్ని గెలవబోతున్నట్లుగా జోస్యం చెప్పారు. తన ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందన్న కేసీఆర్.. ఏ పార్టీకి అయినా ఎన్నికల తర్వాత ఆరేడు నెలలు హనీమూన్ పీరియడ్ అని.. దానికి భిన్నంగా రేవంత్ సర్కారుపై ప్రజల్లో ముందు నుంచే తిరుగుబాటు మొదలైందన్నారు.

తనకున్న అంచనా ప్రకారం తమ పార్టీ 12కు పైగా ఎంపీ సీట్లను గెలుచుకోనున్నట్లుగా కేసీఆర్ చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ అతి ప్రవర్తన.. జుగుప్సాకరమైనభాష.. అవే ఈ రోజున కాంగ్రెస్ కు శాపంగా మారాయని వ్యాఖ్యానించటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీకి చెందిన కొందరు పార్టీ మారిన వైనాన్ని ప్రస్తావించినప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. కొందరు పనికిమాలినోళ్లే పోయారని.. వారి కారణంగా తమకేమీ నష్టం జరగదన్న ధీమాను వ్యక్తం చేశారు.

4

‘‘వాళ్లు పొద్దు తిరుగుడు పువులాంటోళ్లు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి చేరతారు. మా పార్టీ అధికారంలోకి రాగానే వచ్చి మా దాంట్లో దూరారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లో చేరారు.నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే. మా పార్టీ నుంచి పరుగెత్తి పోయి ఇతర పార్టీల్లో అభ్యర్థులుగా ఉన్న వారు.. అన్నిచోట్ల మూడో స్థానంలో ఉన్నారన్నారు. వరంగల్ లో కాంగ్రెస్ పోయినోళ్లు రెండో స్థానంలో ఉన్నారని.. తమది 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీగా పేర్కొన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందన్న అంచనా వేసిన కేసీఆర్.. మోడీ ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

Tags:    

Similar News