పోల‌వరానికి కావాల్సిందెంత‌.. కేంద్రం ఇస్తోందెంత‌?!

అంటే.. పోల‌వ‌రం బాధ్య‌త విష‌యంలో కేంద్రం మొక్కుబ‌డిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న‌కు ఇది బ‌లం చేకూర్చించింది. మ‌రి మిగిలిన మొత్తం సంగ‌తేంటి?;

Update: 2026-02-02 22:30 GMT

ఏపీలో కీల‌క సాగు, తాగు నీటి ప్రాజెక్టుగా పేరొందిన పోల‌వ‌రం ప్రాజెక్టుల‌ను వ‌చ్చే 2027 చివ‌రి నాటికి తొలిద‌శ‌ప‌నులు పూర్తి చేసి.. కుడికాల్వ ద్వారా నీటిని అందించాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప‌నుల‌ను వేగవంతం కూడా చేశారు. ఈ క్ర‌మంలో ఈ ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మ‌య్యే నిధుల‌పై అంచ‌నా వేశారు. దీని ప్రకారం.. మొత్తంగా 30,436 కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని ఇటీవ‌లే స‌వ‌రించిన బ‌డ్జెట్ అంచ‌నాల‌ను కేంద్రానికి పంపించారు. వాస్త‌వానికి ఈ నిధుల‌ను కేంద్ర‌మే ఇవ్వాలి. పోల‌వ‌రం ప్రాజ‌క్టు.. కేంద్ర ప్రాజెక్టుగా ఉన్న నేప‌థ్యంలో దీనిని పూర్తి చేసే బాధ్య‌త కేంద్రంపైనే ఉంటుంది.

అయితే.. తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో పోల‌వ‌రానికి ఈ ఏడాది(2026-27) 3320 కోట్ల రూపాయ‌ల‌ను మాత్ర‌మే చూపించారు. దీనిని విడ‌త‌ల వారీగా ఇవ్వ‌నున్నారు. అయితే.. వాస్త‌వానికి గ‌త ఏడాది ఖ‌ర్చు చేసిన సొమ్ముల‌ను రాష్ట్రానికి ఇంకా రీయింబ ర్స్ చేయాల్సి ఉందని ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. అస‌లు పోల‌వ‌రం పూర్త‌య్యేందుకు ఇప్ప‌టికిప్పుడు 30436 కోట్ల రూపాయ‌లు కావాల‌ని రాష్ట్రం చెబుతోంది. కానీ, కేంద్రం మాత్రం మీరు ఏమైనా చేసుకోండి.. మొత్తంగా తాము ఇచ్చేది 12157 కోట్ల రూపాయ‌లేన‌ని తాజాగా ఇచ్చిన బ‌డ్జెట్ లెక్క‌ల్లో స్ప‌ష్టం చేసింది.

అంటే.. పోల‌వ‌రం బాధ్య‌త విష‌యంలో కేంద్రం మొక్కుబ‌డిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న‌కు ఇది బ‌లం చేకూర్చించింది. మ‌రి మిగిలిన మొత్తం సంగ‌తేంటి? అంటే.. రాష్ట్ర స‌ర్కారే మిగిలిన 18 వేల కోట్ల రూపాయ‌ల‌ను స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తం రాష్ట్రానికి సాధ్య‌మేనా? అంటే.. క‌ష్ట‌మ‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. దీంతో పోల‌వ‌రంపై పెట్టుకున్న నిర్దేశిత ల‌క్ష్యం ఏమేర‌కు స‌ఫ‌లం అవుతుందో చూడాలి. ఇక‌, పోల‌వ‌రం ఎత్తును కూడా.. 41.15 మీట‌ర్ల‌కు ప‌రిమితం చేశారు. వైసీపీ హ‌యాం లోనే దీనిపై కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. వాస్త‌వానికి పోల‌వ‌రం ఎత్తు.. 45.57 మీట‌ర్లు. కానీ, ఒడిశా నుంచి ఎదుర‌వుతున్న ఒత్తిళ్ల నేప‌థ్యంలో కేంద్రం ఈ హైట్‌ను త‌గ్గించింద‌న్న వాద‌న‌లు ఉన్నాయి.

ఇక‌, అమ‌రావతి ఇన్‌క్లూసివ్‌ అండ్‌ సస్టెయినబుల్‌ క్యాపిటల్‌ సిటీ అభివృద్ధికి రూ.1128.91 కోట్లు ఇవ్వ‌నున్న‌ట్టు బ‌డ్జెట్ లో పేర్కొన్నారు. అయితే.. ఈ నిధుల‌ను ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణ రూపంలో ఇవ్వ‌నున్నారు. వాస్త‌వానికి గ‌త ఏడాది 15 వేల‌ కోట్ల రూపాయ‌ల‌ను అప్పుగా ఇస్తామ‌న్నారు. ఇప్పుడు మ‌రో 11 వంద‌ల కోట్ల‌ను ప్ర‌క‌టించారు. తాజాగా దీనిలో అమరావతి ఇంటిగ్రేటెడ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం కింద 432 కోట్ల రూపాయ‌ల‌ను మంజూరు చేశారు. సో.. ఈ రెండు కీల‌క ప్రాజెక్టుల విష‌యంలోనూ కేంద్ర స‌రైన విధంగా నిధులు కేటాయించ‌క‌పోవ‌డం రాష్ట్రానికి తీవ్ర ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News