ఉస్మానియా క్యాంపస్ లో షర్మిల బర్త్ డే వేడుకలు

Update: 2020-12-18 05:00 GMT
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఊరికే అనలేదు. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. తెలంగాణలో తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సైతం ఉస్మానియా వర్సిటీలో సానుకూలత లేదని చెబుతుంటారు. ఈ కారణంతోనే.. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు.. దమ్ముంటే.. ఉస్మానియా క్యాంపస్ లో చర్చకు వస్తారా? అంటూ గులాబీ నేతల్ని పలువురు ప్రశ్నిస్తుంటారు. అప్పటివరకు చెలరేగిపోయే గులాబీ దళ.. ఉస్మానియా క్యాంపస్ మాట ఎత్తితే చాలు.. కామ్ అయిపోతారని చెబుతారు.

అలాంటి ఉస్మానియా క్యాంపస్ లో గురువారం జనన్న విడిచిన బాణం షర్మిల పుట్టినరోజు వేడుకలు జరగటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఆమె పార్టీ స్టార్ట్ చేస్తారన్న ప్రచారం ఈ మధ్య కాలంలో జోరుగా వినిపిస్తోంది. అయితే.. ఈ వాదనకు అటు జగన్ పార్టీ నేతలు కానీ.. ఇటు షర్మిలను అభిమానించే వారెవరూ కూడా స్పందించటం లేదు. అలాంటి వేళ.. ఆమె పుట్టిన రోజున ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో షర్మిల పుట్టినరోజు వేడుకలు జరగటం ఆసక్తికరంగా మారింది.

రాజకీయ వర్గాల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంటర్ కానున్నట్లు చెబుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి తెలంగాణ అధికారపక్షంతో జగన్ కు సత్ సంబంధాలు ఉన్నాయి. అలాంటిది.. తన సోదరిని తెలంగాణ రాజకీయాల్లోకి దింపుతారా? అన్నది ప్రశ్నే. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే.. షర్మిల రాజకీయ ఎంట్రీ తెలంగాణలో మరోసారి షురూ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరేం జరుగుతుందో కాలమే చెప్పాలి.
Tags:    

Similar News