పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల పెంపులేదన్న‌ కేంద్రం.. న‌మ్మొచ్చా? గ‌తంలో ఏం జ‌రిగింది?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ముగియగానే దేశ‌వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతాయి- ఏన‌లుగురు క‌లిసిని ఇదే మాట వినిపిస్తోంది.;

Update: 2026-04-29 07:30 GMT

 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ముగియగానే దేశ‌వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతాయి- ఏన‌లుగురు క‌లిసిని ఇదే మాట వినిపిస్తోంది.  గురూ.. బుధ‌వారం సాయంత్రం ఏ క్ష‌ణ‌మైనా పెట్రోల్ రేట్లు పెరుగుతాయంట‌గా- ఏ ఇద్ద‌రు మిత్రులు క‌లిసినా.. ఇదే మాట‌. మొత్తంగా.. దేశంలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల పెంపుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతుండ‌డం.. ముఖ్యంగా ఇంధ‌న స‌ర‌ఫ‌రాకు హోర్ముజ్ జ‌ల‌సంధిలో ఏర్ప‌డిన ఇబ్బందులు.. త‌ద్వారా దేశంపై ప‌డుతున్న ప్ర‌భావం.

ఫ‌లితంగా ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్ కోసం ముంద‌స్తు కొనుగోళ్లు కూడాపెరిగాయి. ఇంకోవైపు.. బంకుల య‌జ‌మానులు కూడా ఈ విష‌యంలో దోబూచులాడుతున్నార‌న్న చ‌ర్చ ఉంది. బుధ‌వారం సాయంత్రంతో ప‌శ్చిమ బెంగాల్‌లోని 142 నియోజ కవ‌ర్గాల పోలింగ్ పూర్తికానుంది. దీంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా ముగియ‌నుంది. ఇక‌, ఇప్ప‌ట్లో ఎలాంటి ఎన్నిక‌లు లేవు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే దేశంలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెంచేందుకు కేంద్రం స‌మాయ‌త్త‌మైంద‌న్న చ‌ర్చ జోరుగా తెర‌మీదికి వ‌చ్చింది. దీనికి మ‌రో కార‌ణం.. అధిక ధ‌ర‌ల‌కు కేంద్రం కూడా ఇంధ‌నాన్ని కొనుగోలు చేయ‌డ‌మే.

ఈ క్ర‌మంలో దేశంలో ఒక ప్యానిక్ సిట్యుయేష‌న్ అయితే నెల‌కొంది. దీనిపై కేంద్రం తాజాగా వివ‌ర‌ణ ఇచ్చింది. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచే ఉద్దేశం కానీ.. ఆ త‌ర‌హా ప్ర‌తిపాద‌న కాద‌నీ పేర్కొంది. కేంద్ర పెట్రోలియం శాఖ కార్య‌ద‌ర్శి.. తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్యానిక్ త‌మ‌కు కూడా తెలిసింద‌ని.. అయితే, ఎలాంటి పెంపు ఉండ‌ద‌ని ఆ ప్ర‌తిపాద‌న కూడా లేద‌ని వ్యాఖ్యానించారు. పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్ నిల్వ‌లు.. స‌మృద్ధిగా ఉన్నాయ‌న్నారు. ``ఇప్ప‌టి వ‌రకు ధ‌ర‌ల పెంపుపైఎలాంటి ప్ర‌తిపాద‌నా కేంద్రం వ‌ద్ద లేదు.`` అని పేర్కొన్నారు.

న‌మ్మొచ్చా..?

అయితే..ఈ వ్య‌వ‌హారాన్ని న‌మ్మే విష‌యంలో గ‌త అనుభ‌వాలను ప‌రిశీలిస్తే.. అనేక అనుమానాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. గ‌త ఏడాది జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కేంద్రం పెట్రోల్ ధ‌ర‌ల‌ను పెంచేది లేద‌ని తెలిపింది. కానీ, ఎన్నిక‌లు ముగిసిన రెండు గంట‌ల్లోనే లీట‌రుకు రూ.2 చొప్పున పెంచారు. అదేవిధంగా క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కూడా ఇలానే పెంచారు. దీంతో ధ‌ర‌ల పెంపు విష‌యంపై అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. పైగా.. పెట్రోలియం శాఖ కార్య‌ద‌ర్శి చేసిన వ్యాఖ్య‌ల్లోనే సందిగ్ధ‌త ఉంది. ``ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌తిపాద‌న లేదు`` అన్నారు. అంటే.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఉండ‌ద‌ని చెప్ప‌లేదు. సో.. మొత్తానికి ఇదొక సందిగ్ధ‌మైన ప‌రిస్థితి.

Tags:    

Similar News