ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికాపై ప్రపంచ దేశాలకు ఉన్న గౌరవంను ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో తగ్గిస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఇప్పుడు ఈ నిర్ణయంతో మరింత విమర్శల పాలు అవుతున్నాడు.;
అగ్రరాజ్యం అమెరికాలో ఏం జరిగినా అది ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రపంచ దేశాలు ప్రభావితం కావాల్సి ఉంటుంది. అంతటి పవర్ ఫుల్ అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వింత వింతగా అనిపిస్తున్నాయి. మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నిక అయిన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మంది ప్రభావితం అయ్యారు. అయితే ప్రపంచ దేశాలు ఎక్కువగా ఇబ్బందులు పడలేదు. కానీ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలను ఓ ఆట ఆడుతున్నాడు. టారీఫ్ లు అంటున్నాడు, యుద్దం అంటాడు, మేక్ ఇన్ అమెరికా అంటూ రకరకాలుగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీసే నిర్ణయాలను ట్రంప్ తీసుకోవడం జరిగింది.
యుద్ధం కారణంగా ఆర్థిక నష్టం...
ఇప్పటికే యుద్ధం వల్ల అమెరికా తీవ్రమైన ఆర్థిక నష్టాలను చవి చూసింది. ట్రంప్ తీసుకున్న యుద్ద నిర్ణయాల కారణంగా పలు మిడిల్ ఈస్ట్ దేశాలు నష్టపోయాయి. ఇప్పుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం చర్చనీయాంశం అయింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలు జులైలో జరుగనున్నాయి. అందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆ ప్రత్యేక సందర్భంగా అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే పాస్‌పోర్ట్‌లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోను ముద్రించబోతున్నట్లు ప్రకటన వచ్చింది. మొదట ఈ వార్తలను పుకార్లు కొందరు కొట్టి పారేశారు. కానీ ఇటీవల వైట్ హౌస్ అధికారికంగా ఈ విషయాన్ని నిర్థారించింది.
డొనాల్డ్ ట్రంప్ పబ్లిసిటీ పిచ్చి...
ట్రంప్ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కి చేరింది అంటూ అమెరికన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే తన పబ్లిసిటీ కోసం, తన స్వార్థం కోసం, పంథం నెగ్గించుకోవడం కోసం ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా పాస్‌పోర్ట్‌పై ఇలా ఫోటోను ముద్రించడం ద్వారా నియంత పాలన అనిపిస్తోందని సోషల్ మీడియా ద్వారా పలువురు అమెరికన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికన్ పాస్‌పోర్ట్ పై వ్యక్తుల ఫోటోలను ముద్రించిందే లేదు. మరి ఇప్పుడు ట్రంప్ తన ఫోటోను ముద్రించడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అధ్యక్షుడిగా పదవి కాలం పూర్తి అయిన తర్వాత తప్పుకునే ట్రంప్ ఫోటోను పాస్‌పోర్ట్‌లపై ఎలా ముద్రిస్తారు అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం సర్వత్రా విమర్శల పాలవుతోంది.
కరెన్సీ నోట్లపై ట్రంప్ ఫోటో...
అమెరికాపై ప్రపంచ దేశాలకు ఉన్న గౌరవంను ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో తగ్గిస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఇప్పుడు ఈ నిర్ణయంతో మరింత విమర్శల పాలు అవుతున్నాడు. ఇప్పటి వరకు అమెరికన్ పాస్‌పోర్ట్ పై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫోటో ఉంటూ వచ్చింది. యూఎస్ కి చెందిన అత్యంత ప్రముఖుల ఫోటోలు మాత్రమే పాస్‌పోర్ట్ పై ముద్రించారు. మొదటి సారి ట్రంప్ కొత్త ఆనవాయితీని తీసుకు వచ్చాడు. పాస్‌పోర్ట్ పై తన ఫోటోను ముద్రించడం ద్వారా ట్రంప్ అమెరికన్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా చర్చిస్తున్నారు. ఈ నిర్ణయంతో ట్రంప్ తనపై ఉన్న కొద్దిపాటి గౌరవ మర్యాదలను సైతం పోగొట్టుకున్నట్లుగా అనిపించిందని కొందరు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. పాస్‌పోర్ట్ పైనే కాకుండా కరెన్సీ నోట్లను కూడా ట్రంప్ తన ఫోటోతో తీసుకు వచ్చినా ఆశ్చర్యం లేదని కొందరు కామెడీ చేస్తున్నారు.