అమెరికా అహంకారాన్ని దెబ్బకొట్టిన బ్రిటన్ రాజు! నవ్వుతూనే చురకలంటించిన కింగ్..

ట్రంప్ తరచూ నాటో దేశాలపై ఒత్తిడి తీసుకువస్తూ, అమెరికా రక్షణ లేకపోతే యూరప్ ఉనికి లేదన్నట్లు మాట్లాడుతుంటారు.;

Update: 2026-04-29 08:54 GMT

అంతర్జాతీయ దౌత్య నీతిలో అప్పుడప్పుడు చమత్కారాలు వినడానికి బాగుంటాయి. అది కూడా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందే, బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3 తనదైన శైలిలో ‘చారిత్రక’ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అహంకారంతో ఉన్న అగ్రరాజ్యానికి హుందాతనంగా రాజవంశపు కౌంటర్ ఎలా ఉందో ఈ ఘటన నిరూపించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అంటూ ప్రపంచ దేశాలపై తరచూ విమర్శలు చేస్తుంటారు. ఇటీవల ఆయన యూరప్ కంట్రీస్ ను ఉద్దేశించి.. ‘రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా గనుక ఆదుకోకపోయి ఉంటే, ఈరోజు మీరంతా జర్మన్ భాష మాట్లాడుతుండేవారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3 వైట్‌హౌస్ డిన్నర్ కార్యక్రమంలో నవ్వుతూనే అత్యంత పదునైన కౌంటర్ ఇచ్చారు. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. మీరు అన్నది నిజమే కావచ్చు, కానీ ఒకవేళ 250 ఏళ్ల క్రితం మేము (బ్రిటన్) లేకపోయి ఉంటే, ఈరోజు మీరు ఫ్రెంచ్ మాట్లాడుతుండేవారు’ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

కౌంటర్ వెనుక చరిత్ర..

కింగ్ ఛార్లెస్-3 మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం తెలుసుకోవాలంటే 18వ శతాబ్దపు చరిత్రలోకి వెళ్లాలి. 1756-1763 మధ్య ఉత్తర అమెరికా ఖండంలో ఆధిపత్యం కోసం బ్రిటన్ (UK), ఫ్రాన్స్ మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. దీనినే ‘ఫ్రెంచ్ అండ్ ఇండియన్ వార్’ అని కూడా అంటారు. ఆ యుద్ధంలో బ్రిటన్ గెలవకపోయి ఉంటే, ఈరోజు అమెరికాగా పిలవబడే భూభాగం ఫ్రెంచ్ ఆధీనంలో ఉండేది. ఫలితంగా అక్కడ ఇంగ్లీష్ బదులు ఫ్రెంచ్ అధికార భాషగా ఉండేది. చిత్రం ఏమిటంటే, బ్రిటన్‌కు వ్యతిరేకంగా అమెరికా స్వాతంత్ర్య పోరాటం చేసినప్పుడు, అదే ఫ్రాన్స్ అమెరికాకు సహాయం చేసింది. కానీ కింగ్ ఛార్లెస్ మాత్రం అమెరికా ప్రాథమిక ఉనికికి బ్రిటన్ వేసిన పునాదిని గుర్తుచేశారు.

ట్రంప్ ‘జర్మన్’ వ్యాఖ్యలు

ట్రంప్ తరచూ నాటో దేశాలపై ఒత్తిడి తీసుకువస్తూ, అమెరికా రక్షణ లేకపోతే యూరప్ ఉనికి లేదన్నట్లు మాట్లాడుతుంటారు. దానికి కింగ్ ఛార్లెస్ ఇచ్చిన సమాధానం బలమైన దౌత్య సందేశాన్ని పంపింది. ప్రపంచ చరిత్రలో ఏ దేశం కూడా ఒంటరిగా అగ్రరాజ్యం కాలేదు. ప్రతి దేశానికి మరొక దేశం అవసరం ఉంటుంది. అది ఏ విధంగానైనా కావచ్చు. కింగ్ ఛార్లెస్ తన వ్యాఖ్యల ద్వారా అమెరికా 'మూలాలు' బ్రిటన్ నుంచే మొదలయ్యాయని సున్నితంగా గుర్తుచేశారు. సీరియస్‌గా విమర్శించకుండా, డిన్నర్ టేబుల్ వద్ద నవ్వుతూనే ట్రంప్ అహంకారాన్ని దెబ్బకొట్టడం కింగ్ ఛార్లెస్ మార్క్ స్టైల్.

ఈ మాటల యుద్ధం ద్వారా అర్థమైంది ఏంటంటే.. శక్తివంతులు ఎప్పుడూ తామే గొప్ప అనుకుంటారు, కానీ చరిత్ర తెలిసిన వారు పునాదులను గుర్తు ఉంచుకుంటారు. ట్రంప్ తన సైనిక బలాన్ని, బలగాలను చూసి గర్వపడుతుంటే, కింగ్ ఛార్లెస్ తన దేశం అందించిన భాష, సంస్కృతి చరిత్రను చూసి గర్వపడ్డారు. ఈ చమత్కారమైన సంభాషణ అమెరికా-బ్రిటన్ మధ్య ఉన్న 'స్పెషల్ రిలేషన్‌షిప్'లో కొత్త మలుపుగా మిగిలిపోతుంది. భాష ఏదైనా.. భావం ఒక్కటే.. ‘అగ్రరాజ్యమైనా, అల్పరాజ్యమైనా చరిత్రను గౌరవించాల్సిందే!’

Tags:    

Similar News