బీజేపీ గుర్తుపై టేప్.. డైమండ్ హార్బర్‌లో హైడ్రామా.. రీ-పోలింగ్‌కు డిమాండ్!

ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి ఎన్నికల సమయంలో కొన్ని ఘటనలు ఇబ్బంది కలిగిస్తాయి.;

Update: 2026-04-29 09:41 GMT

ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి ఎన్నికల సమయంలో కొన్ని ఘటనలు ఇబ్బంది కలిగిస్తాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠకు, వివాదాలకు కేంద్రబిందువుగా ఉంటాయి. ప్రస్తుతం అక్కడ రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో ఈవీఎం మీదున్న ఒక రాజకీయ పార్టీ గుర్తుపై టేప్ వేసి ఉందన్న వార్త ఎన్నికల పారదర్శకతపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్ సాగుతున్న తరుణంలో డైమండ్ హార్బర్ పరిధిలోని ఫాల్టా నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎం యంత్రంపై ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుర్తుకు ఎదురుగా ఉండే బటన్‌పై టేప్ అంటించి ఉండడం ఓటర్లను విస్మయానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష పార్టీలు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పై విమర్శలు సంధిస్తోంది.

అసలేం జరిగింది..?

సాధారణంగా ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు, వారి పార్టీ గుర్తులు ఉంటాయి. ఓటరు తనకు నచ్చిన గుర్తు పక్కన ఉన్న బటన్‌ను నొక్కాలి. ఒక నిర్దిష్ట పార్టీ గుర్తుపై టేప్ వేయడం వల్ల ఓటర్లు ఆ బటన్‌ను గుర్తించలేకపోవడం లేదా నొక్కడానికి ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ఓటర్లను ప్రభావితం చేయడమే కాకుండా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. ఇది కావాలని చేసిన కుట్ర అని, తమ ఓటర్లను గందరగోళంలో పడేసేందుకు చేసిన ఉద్దేశ్యమని బీజేపీ ఆరోపిస్తోంది. సదరు పోలింగ్ బూత్‌లో ఓటింగ్‌ రద్దు చేసి, వెంటనే రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.

ఎన్నికల సంఘం స్పందన

ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అక్కడ ఉన్న సెక్టార్ అధికారులను, అబ్జర్వర్లను నివేదిక కోరింది. ఆ టేప్ ఎవరు వేశారు..? అది ఎంతసేపు ఉంది..? ఆ సమయంలో ఎంత మంది ఓటు వేశారు..? అనే అంశాలను ఈసీ పరిశీలిస్తోంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే, ఆ టేప్ వల్ల ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగిందని నిర్ధారణ అయితే, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అక్కడ రీ-పోలింగ్ నిర్వహించే అధికారం ఈసీకి ఉంటుంది. పోలింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్ల సమక్షంలో 'మాక్ పోలింగ్' జరుగుతుంది. అప్పుడు లేని టేప్ తర్వాత ఎలా వచ్చింది? అనే కోణంలో పోలింగ్ సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది.

ఈవీఎంలపై టేపులు వేయడం లేదా గుర్తులను కనిపించకుండా చేయడం వంటి పనులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయి. ఓటరుకు తన నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉంటుంది. ఇటువంటి ఘటనలు వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సడలిస్తాయి. బెంగాల్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఎన్నికల సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఈసీ తీసుకునే నిర్ణయం ఈ నియోజకవర్గ ఫలితంపై ప్రభావం చూపవచ్చు.

Tags:    

Similar News