యూకేలో ఇరాన్ ఎంబసీ పోస్ట్.. రాయబారికి బ్రిటన్ సమన్లు! ఇంతకీ పోస్టులు ఏముంది?
అంతర్జాతీయ దౌత్య నీతిలో ఎన్నడూ లేని విధంగా ఒక రాయబార కార్యాలయమే నేరుగా 'బలిదానాలకు రండి' అంటూ పిలుపునివ్వడం దిగ్భ్రాంతికరమైన విషయం.;
అంతర్జాతీయ దౌత్య నీతిలో ఎన్నడూ లేని విధంగా ఒక రాయబార కార్యాలయమే నేరుగా 'బలిదానాలకు రండి' అంటూ పిలుపునివ్వడం దిగ్భ్రాంతికరమైన విషయం. ప్రస్తుతం సాగుతున్న ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం (ఫిబ్రవరి 28, 2026న ప్రారంభమైనది) ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను ఈ యుద్ధం బలితీసుకుంది. ఈ ఉద్రిక్తతల మధ్య లండన్‌లోని ఇరాన్ ఎంబసీ చేసిన పోస్ట్ యూకేలో సంచలనం సృష్టిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ లండన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్‌లో వేసిన పోస్ట్ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ‘శత్రువుకు దేశాన్ని అప్పగించే బదులు, మనమంతా ప్రాణాలు అర్పిద్దాం’ అంటూ ఇరాన్ మహాకవి ఫెర్దౌసీ రచించిన ‘షా నామా’ లోని పంక్తులను ఉటంకిస్తూ పోస్ట్ చేశారు. యూకేలో నివసిస్తున్న ఇరాన్ పౌరులు ‘జన్ ఫాదా’ (మాతృభూమి కోసం ప్రాణత్యాగం) కార్యక్రమం కింద స్వచ్ఛందంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరడం ఇప్పుడు బ్రిటన్ భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.
‘ఈ పోస్ట్’లో ఏముంది..?
యూకేలోని ఇరాన్ రాయబార కార్యాలయం పర్షియన్ భాషలో చేసిన పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ‘Let us all, to a man, give our bodies to be slain; For it is better than giving our country to the enemy.’ (శత్రువుకు మన దేశాన్ని ఇచ్చే కంటే, మనమంతా ఒక్కటై మన దేహాలను సమర్పించడం మేలు). ఈ పోస్ట్ ద్వారా విదేశాల్లోని ఇరాన్ పౌరులు యుద్ధంలో పాల్గొనడానికి వీలుగా ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.
బ్రిటన్ కుదౌత్యపరమైన చిక్కులు
యూకే ప్రభుత్వం ఈ పోస్ట్‌ను కేవలం దేశభక్తిగా చూడడం లేదు. దీనిని 'హింసను ప్రోత్సహించడం' మరియు 'తీవ్రవాదాన్ని ప్రేరేపించడం'గా భావిస్తోంది. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి హామిష్ ఫాల్కనర్ వెంటనే ఇరాన్ రాయబారి సయ్యద్ అలీ మౌసావిని పిలిపించి నిరసన వ్యక్తం చేశారు. బ్రిటన్ గడ్డపై ఉంటూ ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు. విదేశాల్లో నివసిస్తున్న వారిని యుద్ధానికి ప్రేరేపించడం వల్ల యూకేలోని అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక రకమైన 'ఆన్‌లైన్ రాడికలైజేషన్' అని వారు అభివర్ణిస్తున్నారు.
సమర్థించుకుంటున్న ఇరాన్.. అధ్యక్షుడి బాటలోనే ఎంబసీ
ఇరాన్ రాయబార కార్యాలయం తన చర్యను సమర్థించుకుంది. ఇది ఏ దేశంపైనా శత్రుత్వంతో చేస్తున్నది కాదని, కేవలం తమ మాతృభూమిని రక్షించుకోవడానికి పౌరులు చూపిస్తున్న ‘జన్ఫాదా’ (త్యాగం) స్ఫూర్తి అని పేర్కొంది. ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి తనతో సహా 14 మిలియన్ల మంది ఇరానీయులు ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఎంబసీ పోస్ట్ కూడా అదే భావజాలాన్ని ప్రతిబింబిస్తోందని చెబుతున్నారు.
ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వంటి కీలక నేతలను కోల్పోయింది. అటువంటి క్లిష్ట సమయంలో దేశాన్ని ఏకం చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ఇలాంటి ‘బలిదాన’ ప్రచారాలను వాడుకుంటోంది. అయితే, ఒక విదేశీ గడ్డపై ఉంటూ ఆ దేశ చట్టాలను, అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమిస్తూ ఇలాంటి పోస్ట్‌లు చేయడం దౌత్యపరంగా ఇరాన్‌ను మరింత ఏకాకిని చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలు యుద్ధం తీవ్రమయ్యేందుకు దారి తీస్తాయా? లేక అంతర్జాతీయంగా ఇరాన్‌పై ఒత్తిడిని పెంచుతాయా? అనేది చూడాలి.