పుతిన్ పదవి కొన్ని నెలలే.. తిరుగుబాటు తథ్యం

Update: 2022-05-15 10:30 GMT
20 ఏళ్ల నుంచి రష్యాను తిరుగులేకుండా పాలిస్తున్నారు వ్లాదిమిర్ పుతిన్. మధ్యలో కొంతకాలం అధ్యక్షుడిగా తప్పుకొన్నా.. తర్వాత మళ్ల్లీ పదవిని చేజిక్కించుకున్నారు. ఇప్పుడాయన జీవిత కాల అధ్యక్షుడు. 69 ఏళ్ల పుతిన్ కు ఆ దేశంలో తిరుగులేదు. అయితే, ఆయన్ను పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నట్లు ఉక్రెయిన్ నిఘా అధికారి కిరిలో బదనోవ్ తెలిపారు. ఆగస్టు కల్లా పుతిన్ పదవీచ్చుతుడు కావడం ఖాయమంటున్నారు. బదనోవ్ స్కై న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆగస్టు మధ్యలో యుద్ధం కీలక మలుపు తీసుకొని ఏడాది చివరకు ముగుస్తుందని బుదనోవ్‌ అంచనా వేశారు. ఒకవేళ ఈ యుద్ధంలో రష్యా ఓడిపోతే.. పుతిన్‌ పదవి నుంచి తొలగిపోతారని, ఆ దేశం కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఆయనను గద్దె దింపే ప్రయత్నాలు కొంతమంది ప్రారంభించారని తెలిపారు. వారు ఆ దిశగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పరోక్షంగా పుతిన్‌పై తిరుగుబాటుకు రష్యాలో కొంతమంది యత్నిస్తున్నారని బుదనోవ్‌ చెప్పుకొచ్చారు. పైగా వారిని ఆపడం అసాధ్యమని కూడా అభిప్రాయపడ్డారు.

పుతిన్.. రోగాల పుట్ట
పుతిన్‌ క్యాన్సర్‌ సహా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని బుదనోవ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే, యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్‌పై తప్పుడు ప్రచారాల్లో భాగంగా చేస్తున్న ఆరోపణలుగా వీటిని ఎందుకు భావించకూడదని బుదనోవ్‌ను ప్రశ్నించగా..ఇలాంటి సమాచారం తెలుసుకోవడం తన విధుల్లో భాగమని.. తనకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుందని సమాధానమిచ్చారు. పుతిన్‌ ఆరోగ్యం దెబ్బతిందని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. రష్యా మాత్రం వీటిపై స్పందించలేదు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా తీవ్రంగా నష్టపోతోందని బుదనోవ్‌ తెలిపారు. పుతిన్‌ సేనను చూసి ఐరోపా భయపడుతున్న మాట వాస్తవమన్నారు. కానీ, రష్యా అనుకున్నంత బలమైన దేశం కాదని చెప్పుకొచ్చారు. వారి సైన్యాన్ని ఆయుధాలు కలిగిన జనసమూహంగా అభివర్ణించారు. ఖర్కీవ్‌లో రష్యా సేనలను ఉక్రెయిన్‌ బలగాలు సరిహద్దుల వరకు తరిమికొట్టాయన్నారు. ఇప్పటికే రష్యా అనేక మంది సైనికుల్ని, ఆయుధాల్ని కోల్పోయిందని తెలిపారు.
Tags:    

Similar News