బాబుపై దుమ్మెత్తిపోసిన రోజా!

Update: 2019-12-16 16:25 GMT
వైసీపీ ఫైర్‌ బ్రాండ్ నేత ఆర్కే రోజా స‌భ వేదిక‌గా నోరు జారారు. ఏకంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ ను ఇరుకున ప‌డేశారు. వెంట‌నే స‌ర్దుకొని...క్ష‌మాప‌ణ చెప్పారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును బుక్ చేయ‌బోయి....అనుకోకుండా చేసిన‌ కామెంట్‌కు త‌క్ష‌ణ‌మే స‌ర్దుకున్నారు. మద్యపాన నిషేధం పై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఇలా ఒకింత ఇబ్బంది ప‌డి ఆ త‌ర్వాత త‌న‌దైన శైలిలో ప్ర‌సంగించారు.

మ‌ద్య‌ నిషేధం పై చ‌ర్చ‌లో భాగంగా రోజా మాట్లాడుతూ...మ‌ద్యం వల్ల పేదవాళ్ల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయని.. అన్నిటీకి అనర్థం మద్యమేనని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  అయిదేళ్ల చంద్రబాబు పాలనలో మద్యం పాలసీతో కొన్ని లక్షల మంది కుటుంబాలు అన్యాయం అయిపోయాయని మండిప‌డ్డారు. బాబు పాల‌న‌లో అయిదేళ్లలో రూ.75వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని రోజా తెలిపారు. మద్యం ధరలు పెరగడంతో మందుబాబులు బట్టలు - చెప్పులు కొనుక్కోలేని పరిస్థితిలోకి వెళ్లారని చంద్రబాబ అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మద్యం అంటే అంత మక్కువ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. బ్రాందీ పాలనను అంతం చేసి గాంధీ పాలనను తీసుకొచ్చారని జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.

ఇదే స‌మ‌యంలో - మద్యపానం నిషేధంపై అసెంబ్లీలో చంద్రబాబు గురించి మాట్లాడుతున్న క్రమంలో పొరపాటున చంద్రబాబును రోజా ముఖ్యమంత్రి అన్నారు. మద్యపాన నిషేధం చర్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి పారిపోయారంటూ వ్యాఖ్యానించిన రోజా.. తన పొరపాటు వెంటనే గుర్తించి క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు పారిపోయారంటూ రోజా తన వ్యాఖ్యలను సరిచేసుకున్నారు. ఆరు నెలల్లోనే దశలవారీ మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌ కే దక్కుతుందన్నారు. 43వేల బెల్ట్‌ షాపులను తొలగించి - 40 శాతం బార్లు కూడా తగ్గించారని తెలిపారు. గతంలో ఉన్న నాలుగువేలకు పైగా పర్మిట్‌ రూమ్‌ లను తొలగించారని.. ఇచ్చిన మాటను జగన్ అమలు చేశారని తెలిపారు. ఇన్నాళ్లు చరిత్రను విన్నాం, చదివాం. మొట్టమొదటిసారిగా సీఎం జగన్‌ పాలనలో చరిత్రను రాయడం చూస్తున్నామని తెలిపారు.

పులిహోర తిన్నంత మాత్రాన పులులు అయిపోరని రోజా తెలిపారు . ఎన్ని కష్టాలు వచ్చినా - అక్రమ కేసులు బనాయించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా - వైఎస్‌ జగన్‌ చిరునవ్వుతో ఎదుర్కొని ప్రజల హృదయాలను గెలుచుకుని సీఎం అయ్యారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ సీఎం నెరవేర్చుతున్నారని.. అలాం‍టివారిని పులి అంటారు కానీ… పులిహోర బ్యాచ్‌ ను పులి అనరని చెప్పారు రోజా. వెన్నుపోటు పొడిపించుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి ఏమీ.. ఎన్టీఆర్ కాదని రోజా వ్యాఖ్యానించారు.



Tags:    

Similar News