పవన్ ఢిల్లీ వెళ్లక్కరలేదు... అంతా హాట్ లైన్ లోనే ?
ఆ మాటకు వస్తే ఆయన గతంలో కూడా ఎపుడూ వెళ్ళింది లేదు, ఆయన గడచిన ఏణ్ణర్థం కాలంలో ఉప ముఖ్యమంత్రిగా ఢిల్లీ ఒకటి రెండు సార్లు వెళ్ళి ఉంటారేమో.;
జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దగా వెళ్ళడం లేదు. ఆ మాటకు వస్తే ఆయన గతంలో కూడా ఎపుడూ వెళ్ళింది లేదు, ఆయన గడచిన ఏణ్ణర్థం కాలంలో ఉప ముఖ్యమంత్రిగా ఢిల్లీ ఒకటి రెండు సార్లు వెళ్ళి ఉంటారేమో. ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్ళడం లేదు ఆయనతో బీజేపీ పెద్దలు గ్యాప్ పాటిస్తున్నారా అన్నది కూడా రాజకీయంగా చర్చగా ఉన్న విషయమే. అంతే కాదు అదే సమయంలో మంత్రి నారా లోకేష్ ఎక్కువగా ఢిల్లీ టూర్లు చేస్తున్నారు. దాంతో ప్రాధాన్యత పరంగా చూస్తూ పవన్ ని తగ్గించే ప్రయత్నం జరుగుతోంది అన్న వార్తలు కూడా రాస్తున్నారు. కానీ వాస్తవం వేరేలా ఉంది అన్నది ఢిల్లీ వర్గాల భోగట్టాగా ఉంది.
టచ్ లోనే అగ్ర నేతలు :
పవన్ నేరుగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర బీజేపీ పెద్దలతో సమావేశాలు భేటీలు వేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఆయన ఒక విధంగా చూస్తే నిరంతరం బీజాపీ పెద్దలతో టచ్ లో ఉన్నారని కూడా చెబుతున్నరు. వాస్తవంగా చూస్తే పవన్ అంటే నరేంద్ర మోడీ ఎంతో ఇష్టపడతారు అని అంటారు. అలాగే అమిత్ షా కూడా ఆయన అంటే అభిమానం చూపిస్తారు అని అంటారు. జనసేన తమకు ఎంతో నమ్మకమైన మిత్రపక్షంగా ఉందని బీజేపీ పెద్దలు చెబుతూ ఉంటారు. దాంతో పాటుగా పవన్ తో వారు ఎంతో బాగా ఉంటూ వస్తున్నారని ఈ రోజుకీ అదే కొనసాగుతోందని అంటున్నారు.
హాట్ లైన్ నడుస్తోందా :
ఢిల్లీ టూ జనసేన ఆఫీస్ ల మధ్య హాట్ లైన్ నడుస్తోందా అన్నది కూడా చర్చగా ఉంది. పవన్ తో అన్ని విషయాలను పంచుకుంటూ ఒక విధంగా చాలా సాన్నిహిత్యమే బీజేపీ అగ్ర నాయకత్వం మెయిన్ టెయిన్ చేస్తోంది అని అంటున్నారు. ఇక పవన్ అంటే క్రౌడ్ పుల్లర్ అన్నది తెలిసిందే. ఆయన సినీ గ్లామర్ అతి పెద్ద బలం. అలాగే రాజకీయంగా చూస్తే బలమైన సమాజిక వర్గం దన్ను ఉంది. అలాగే ఇతర వర్గాలలో కూడా ఆకర్షణ ఆదరణ ఉన్నాయి. దాంతో తమ వద్ద పవన్ ఉన్నారు అన్న ధీమా అయితే బీజేపీ పెద్దలలో ఉందని చెబుతున్నారు. ఇక పవన్ ని చూసుకుని ఆయనతో కలసి రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ బలం పెంచుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.
రోడ్ మ్యాప్ రెడీ :
అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన బీజేపీ ఎదిగేందుకు మరింత బలంగా ముందుకు సాగేందుకు బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ని రెడీ చేసారు అని అంటున్నారు. దానిని అమలు చేసే విషయంలో పవన్ ని కూడా విశ్వాసంలోకి తీసుకుంటున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇక చూస్తే 2026లో కేరళ, తమిళనాడులలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఆ రెండు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని పూర్తిగా వినియోగించుకోవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.
తెలంగాణాలోనూ :
మరో వైపు చూస్తే ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణాలో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. దాని కోసం అవసరం అయిన పక్షంలో జనసేనతో అక్కడ పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని బీజేపీ కొత్త ఆలోచనలు చేస్తోందని ప్రచారం సాగుతోంది. పవన్ కి యూత్ లో ఎంతో బలం ఆకర్షణ ఉన్నాయి. అలాగే కొన్ని సామాజిక వర్గాలలో మంచి పట్టు జనసేనకు ఉంది. దాంతో వాటిని తమ వైపు తిప్పుకోవాలీ అంటే పవన్ తో జట్టు కట్టడమే మేలు అన్నది కమలం పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా చెబుతున్నారు.
ఏపీలో కీలకంగా :
ఇక పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఫ్యూచర్ లో మరింత కీలకంగా మారుతారు అన్నది బీజేపీ పెద్దల భావన. ఆ దిశగా ఆయనతో నడిచేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. పవన్ కూడా జాతీయ పార్టీగా బలంగా ఉన్న బీజేపీతోనే తన రాజకీయ ప్రయాణం పొత్తులు అన్నట్లుగానే ముందుకు సాగుతున్నారు. ఆయన సనాతన ధర్మం హిందూ వాదం వంటి ప్రకటనలు తరచూ చేస్తున్నారు అంటే బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగమే అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ బీజేపీల మధ్య మంచి బంధం ఉందని అంది ఇంకా గట్టిపడుతుందని అంటున్నారు.