ముగిసిన వింటర్ సెషన్...హైలెట్స్ ఇవే !

పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ 19 దాక సాగింది.;

Update: 2025-12-20 03:48 GMT

పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ 19 దాక సాగింది. లోక్ సభ ఉత్పాదకత దాదాపు 111 శాతం ఉంది అన్నారు. మొత్తం 15 సభలు జరిగాయి. రాజ్యసభ దాదాపు 92 గంటలు పనిచేసిందని 121 శాతం ఉత్పాదకతను నమోదు చేసిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సభలో అనేక కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. ఈసారి సభలో విశేషం ఏమిటి అంటే చారిత్రాత్మకమైన జాతీయ గీతం వందేమాతరం 150 వ వార్షికోత్సవం సందర్భంగా ఉభయ సభలూ ప్రత్యేక చర్చని నిర్వహించాయి. దానితో పాటు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్ మీద కూడా రెండు సభలూ చర్చించాయి.

కీలక బిల్లులు చూస్తే :

లోక్‌సభలో పది బిల్లులు ప్రవేశపెట్టగా అందులో ఎనిమిది బిల్లులు శీతాకాల సమావేశాలలో ఆమోదించారు. రాజ్యసభ కూడా ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలిపింది. పార్లమెంటులో ఆమోదించబడిన ముఖ్యమైన బిల్లులు గురించి చూస్తే కనుక వికసిత్ భారత్ - రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ కోసం హామీ షార్ట్ కట్ లో వికసిత్ భారత్ - జి రామ్ జి బిల్లు 2025 గా ఉంది. అలాగే సుస్థిర అణుశక్తి వినియోగం భారతదేశ పరివర్తన కోసం అభివృద్ధి బిల్లు, బీమా చట్టాల సవరణ బిల్లు ఆరోగ్య భద్రత నుండి జాతీయ భద్రతా సెస్ బిల్లు 2025 ఉన్నాయి. వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు- 2025ను పరిశీలన కోసం పార్లమెంట్ సంయుక్త కమిటీకి పంపారు.

అమిత్ షా వర్సెస్ రాహుల్ :

శీతాకాల సమావేశాలు వేడిని పుట్టించాయి. ఒక సందర్భంలో లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అలాగే కాంగ్రెస్ పక్ష నాయకుడు రాహుల్ గాంధీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అది సభలో ఉద్రిక్తలకు దారి తీసింది. అలాగే జి రామ్ జి బిల్లు ఆమోదం సందర్భంగా కూడా లోక్ సభ రాజ్యసభలలో గందరగోళం చోటు చేసుకుంది. విపక్ష సభ్యులు నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం, చర్చకు సమాధానం ఇస్తున్న మంత్రిని అడ్డుకోవడం కాగితాలను చించి సభలో విసిరేయడం వంటివి జరిగాయి.

ఎన్డీయే హ్యాపీ :

ఈసారి జరిగిన శీతాకాల సమావేశాలు సంతృప్తిగా ఉన్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పుకొచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించబడిన బిల్లులు కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో ఈ బిల్లులదే ప్రధాన పాత్ర అని ఆయన అన్నారు. సభలు సజావుగా సాగడానికి అన్ని పార్టీలు సహకరించాయని ఆయన చెప్పడం విశేషం. అయితే వింటర్ సెషన్ ప్రారంభం సందర్భం నుంచి అయితే విపక్షాలు తన ఆందోళనను ఏదో విషయం మీద తెలియచేస్తూనే ఉన్నారు. ఈసారి సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ బాగా ప్రశ్నించారు అన్న మాట ఉంది. అలాగే నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు తమ శాఖల గురించి చక్కగా వివరిస్తూ విపక్షాల మన్ననలు అందుకోవడం విశేషం. మరి 2026లో జరిగే బడ్జెట్ సెషన్ వరకూ పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడినట్లే.

Tags:    

Similar News