తెలంగాణాలో సాఫీగా... ఏపీలో అసలు చాన్స్ ఉందా ?
తాజాగా మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు తెలంగాణాలో జరిగాయి. మొత్తం 12,733 పంచాయతీలకు జరిగిన ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమకు ఉన్న శక్తి మేరకు గెలుచుకున్నాయి.;
తాజాగా మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు తెలంగాణాలో జరిగాయి. మొత్తం 12,733 పంచాయతీలకు జరిగిన ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమకు ఉన్న శక్తి మేరకు గెలుచుకున్నాయి. ఎక్కడా రిగ్గింగ్ వంటి మాటలు వినిపించలేదు, స్వేచ్చగానే ఎన్నికలు జరిగాయన్నది రాజకీయ వాతావరణం చూసిన వారికి అర్థం అవుతున్న విషయం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 7010 పంచాయతీలు దక్కితే బీఆర్ఎస్ కి 3502 సర్పంచ్ పదవులు, బీజేపీకి 688 సర్పంచ్ పదవులు దక్కాయి. ఇతరులకు 1505 సర్పంచ్ పదవులు లభించాయి. ఇలా ఎవరి రాజకీయ వాటా వారి రాజకీయ వ్యూహాలు రాజకీయ ప్రదర్శనలను బట్టి లభించింది.
ప్రజల విశ్వాసం :
తమ పార్టీకి ప్రజల విశ్వాసం ఉందని కాంగ్రెస్ చెప్పుకుంది. అయితే ఆ పార్టీకి 56 శాతం పైగా సర్పంచులు దక్కాయి. దాంతో పాటు మొత్తం 31 జిల్లాలలో 30 జిల్లాల దాకా తమ ఆధిక్యతను చాటుకుంది. దాంతో ప్రజలు అంతా తమ వైపు ఉన్నారని కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమ పట్ల తమ పాలన పట్ల ప్రజల ఆదరణకు ఇది నిదర్శనం అని వారు అంటూంటే బీఆర్ఎస్ కూడా తమకు 3502 సర్పంచులు దక్కాయని ఇదే ఊపులో ఎంపీటీసీ జెడ్పీటీసీలను ఎక్కువగా గెలుచుకుంటామని అంటోంది. బీజేపీ చూస్తే 688 తమ మద్దతుదారులకు దక్కినా ఇతరుల దాంట్లో కూడా తమ వారు కొదరు పోటీ చేశారు. దాంతో ఆ సంఖ్యతో కలుపుకుని వేయి దాకా సర్పంచులు తమ ఖాతాలో ఉన్నట్లే అంటున్నారు. మొత్తానికి చూస్తే అంతా హ్యాపీ అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది.
ఏపీలో సీన్ వేరే :
ఇక వచ్చే ఏడాది అంటే 2026లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మరి తెలంగాణాలో జరిగినట్లుగా ఏపీలో కూడా ఇదే మాదిరిగా సాఫీగా ఎన్నికలు జరుగుతాయా అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే దెబ్బకు దెబ్బ మాటకు మాట పంచ్ కి పంచ్ అన్నట్లుగా ఏపీలో పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. వైసీపీ హయాంలో 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తే అధికార పార్టీ అన్ని చోట్లా దౌర్జన్యాలు చేసిందని అందుకే తాము అప్పట్లో పోటీ కూడా వద్దు అనుకున్నామని టీడీపీ నేతలు ఇప్పటికీ చెబుతారు. జెడ్పీటీసీ ఎన్నికలను వారు అంతా బహిష్కరించారు కూడా. దాంతో ఇపుడు అదే రూల్ ని కూటమి ఫాలో అవుతుందా లేదా అన్నది చర్చగా ఉంది.
పులివెందుల చూస్తే :
ఈ మధ్యనే జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల తీరుని చూస్తే కనుక ఏపీలో లోకల్ బాడీ ఫైట్ ఎలా ఉంటుందో అన్నది అర్ధం అవుతుంది అని అంటున్నారు. నిజానికి కూటమి అంటే మూడు పార్టీలు ఉన్నాయి. రాజకీయం అంతా ఏకపక్షం చేయాలని తపన కూడా ఉంది. విపక్షంలో ఒక్క వైసీపీ తప్ప మరో పార్టీ కూడా లేదు. దాంతో కూటమి దూకుడు చేస్తుందని కూడా మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుసరించిన విధానం ప్రకారం వైసీపీ కూడా ఎన్నికలను బహిష్కరిస్తుందా లేక పోటీలో నిలిచి తమ సత్తా చాటుతుందా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే తెలంగాణాలో ఎన్ని రకాలుగా నేతల మధ్య మాటల వాడి వేడి ఉన్నా చాలా విషయాలలో రాజకీయాలను సంప్రదాయంగా నిర్వహించడంతో మాత్రం అంతా బాగానే ఉంటున్నారు అని అంటున్నారు. ఏపీలో కూడా ఆ రకమైన పరిస్థితి చూడగలమా అంటే ఇప్పట్లో కష్టమే అని మాట వినిపిస్తోంది.