కొత్త ఏడాది కూటమి శుభవార్త

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పంటి బిగువన సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది.;

Update: 2025-12-20 04:00 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పంటి బిగువన సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అందులో మేజర్ వాటా ఏది అంటే సామాజిక పెన్షన్లు అని కచ్చితంగా చెప్పాలి. తాజాగా పెన్షన్లు పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటను బట్టి చూస్తే ఏపీలో ఏటా దాదాపుగా 30 వేల కోట్ల రూపాయలకు పైగా దీని కోసం కేటాయించి ఖర్చు చేస్తున్నారు. అంటే వచ్చే ఆదాయంలో ఇది అతి పెద్ద షేర్ గా ఉండే ఖర్చు అన్న మాట. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు, అలాగే కిడ్నీ రోజులు దివ్యాంగులకు ఇతర కేటగిరీలకు కలుపుకుని ఏకంగా గరిష్టంగా పదిహేను వేల రూపాయల దాకా ఈ పెన్షన్లు ప్రతీ నెలా ఇస్తున్నారు అంటే ఏపీకి ఉన్న ఆర్థిక పరిస్థితి చూసినపుడు గ్రేటెస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది.

లక్షలలో పెన్షన్లు :

ఏపీలో పెన్షన్లు కూడా లక్షలలో ఇస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 65 లక్షలకు పైగా లబ్ధిదారులకు ప్రతీ నెలా ఈ పెన్షన్లను అందిస్తోంది. వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్‌జెండర్లు డప్పు కళాకారులు, అంగ వైకల్యం ఉన్న వ్యక్తులు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి తో బాధపడుతున్న వ్యక్తులు ఇలా అన్ని రకాల కేటగిరీలకు పెన్షన్లు అందుతున్నాయి. అయితే ఈ పెన్షన్ల కోసం ప్రతీ జిల్లా నుంచి కొత్తగా దరఖాస్తులు కూడా వస్తున్నాయి. అవి నిరంతరం సాగే ప్రక్రియగా ప్రభుత్వం కూడా చెబుతూ వస్తోంది.

జిల్లాకు రెండు వందలు :

అయితే 2026 లోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వం కొత్త వార్తను ఒక శుభవార్తను లబ్దిదారులకు వినిపిస్తోంది. మరిన్ని పెన్షన్లు ఏపీలో కొత్తగా ఇవ్వడానికి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రతీ జిల్లాలో కనీసంగా రెండు వందల మందికి తగ్గకుండా మొత్తం 26 జిల్లాలలో 5200 మందికి పైగా లబ్దిదారులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది అని చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకోవడమే కాదు కలెక్టర్లకు ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు.

గుర్తించాల్సిందే :

ప్రభుత్వానికి వచ్చే దరఖాస్తులలో అర్హులు ఎవరు అన్నది జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు, అలాగే ఆయా జిల్లాల కలెక్టర్లు గుర్తించి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు అని అంటున్నారు. పెద్ద ఎత్తున పెన్షన్ల కోసం అయితే విన్నపాలు వస్తున్నాయని అంటున్నారు. అయితే వాటిలో అర్హత కలిగిన వారు ఉంటే కనుక వెంటనే పెన్షన్ ఇవ్వాల్సిందే అని ప్రభుత్వం సూచిస్తోంది. దీని వల్ల పెద్ద ఎత్తున లబ్ధిదారులకు న్యయం జరుగుతుందని అంటున్నారు. మొత్తానికి 2026 లో శుభవార్త గానే దీనిని చూస్తున్నారు.

Tags:    

Similar News