పయ్యావుల...విన్నపాలు వినాల్సిందే
పార్టీ గెలిస్తే ఆయన ఓడేవారు. మొత్తానికి మంత్రి పదవి దక్కింది అన్న ఆనందం ఉన్నా ఏకంగా బరువైన ఆర్థిక శాఖనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు అప్పగించారు.;
కూటమి ఆర్ధిక మంత్రిగా పయ్యావుల కేశవ్ వ్యవహరిస్తున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, తొలిసారి 1994లో గెలిచారు. అంటే మూడు దశాబ్దాల పైదాటిన అనుభవం ఉంది. కానీ తొలిసారి 2024 లో మంత్రి పదవి దక్కింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినపుడు పార్టీ ఓడింది. పార్టీ గెలిస్తే ఆయన ఓడేవారు. మొత్తానికి మంత్రి పదవి దక్కింది అన్న ఆనందం ఉన్నా ఏకంగా బరువైన ఆర్థిక శాఖనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు అప్పగించారు. దాంతో ఎంతో డైనమిక్ గా ఉండే పయ్యావుల ఆర్థిక వ్యవహారాలతో చాలా బిజీ అయిపోయారు.
విభజన ఏపీలో కష్టాలు :
ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లోనే ఏకంగా 17.5 లక్షల కోట్ల లోటు ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ ఏపీ స్థితి వేరు. ఏపీ పూర్తిగా వ్యవసాయిక రాష్ట్రంగా ఉంది. సేవా రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ పెద్దగా వృద్ధి చెందలేదు, దాంతో ఏపీకి ఆదాయ వనరులు సమకూరడం కష్టంగా ఉంటోంది. పైగా ఏపీలో అతి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక వైపు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ అమరావతి ఉంది. అలాగే జాతీయ ప్రాజెక్ట్ అయినా పొలవరం విషయంలో ముందుగా ఏపీ ప్రభుత్వమే ఖర్చు చేస్తే రీఇంబర్స్ మెంట్ జరుగుతుంది. ఇవి కాకుండా నీటి పారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ రంగానికి విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే వైద్య ఆరోగ్య రంగం మీద ఖర్చు చేయాల్సి ఉంది.
సూపర్ సిక్స్ హామీలతో :
ఇక సూపర్ సిక్స్ హామీలు కూడా ఏపీ ఖజనాను సవాల్ చేస్తున్నాయి. ఈ హామీలు నెరవేర్చడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంది. ఒక్క సామాజిక పెన్షన్లకే ఏడాదికి 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. అలాగే అన్న దాతా సుఖీ భవ ఉంది. ఉచిత బస్సు ఉంది, తల్లికి వందనం పధకం ఉంది, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఏకంగా బడ్జెట్ లో ఏ డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలను కోరుతాయి. ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్ ఇలా వాటికి కూడా తొంబై వేల కోట్ల దాకా కేటాయింపులు చేయాలి, ఇక అభివృద్ధికి ఖర్చు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. దాంతో ఆర్ధిక మంత్రికి బడ్జెట్ అంటే కత్తి మీద సాము లాంటి వ్యవహారంగా ఉంటోంది.
మంత్రుల విన్నపాలు :
ఇక వివిధ శాఖలకు చెందిన మంత్రులు అంతా వచ్చి పయ్యావులను కలుస్తున్నారు. తమ శాఖకు దండీగా నిధులు కేటాయించాలని వారు కోరుతున్నారు. హోంమంత్రి అనిత, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పయ్యావులను కలసి ఈసారి అధిక మొత్తంలో కేటాయింపులు చేయాలని కోరారు. ఇంకో వైపు చూస్తే సగటు జనాలు బడ్జెట్ మీద కోటి ఆశలను పెట్టుకుంటున్నారు. బడ్జెట్ లో ఏమైనా హామీలు నెరవేర్చారా లేదా కొత్త పధకాలకు శ్రీకారం చుడుతున్నారా లేక తమకు ఏమైనా మేలు చేయబోతున్నారా ఏమైనా రాయితీలు ఇస్తున్నారా అని అయిదు కోట్ల మంది ఆంధ్రులు ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తం మీద చూస్తే పయ్యావులకు మాత్రం 2026-27 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ అన్నది వండడం చాలా నేర్పుగా ఓర్పుగా చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఏపీ కి పెద్దగా నిధుల రూపంలో ఇచ్చింది లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే నిధుల వెతుకులాటలో ఉండాల్సి ఉంది.