ఏపీలో గ‌ద్ద‌ర్ విగ్ర‌హం.. చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఇదే!

ప్ర‌జా గాయ‌కుడు.. క‌మ్యూనిస్టు భావ‌జాలాలు పుణికి పుచ్చుకున్న గ‌ద్ద‌ర్ విగ్ర‌హాన్ని ఏపీలో ఏర్పాటు చేయాల‌ని.. ఆయ‌న కుమార్తె వెన్నెల సీఎం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు.;

Update: 2026-02-05 11:55 GMT

ప్ర‌జా గాయ‌కుడు.. క‌మ్యూనిస్టు భావ‌జాలాలు పుణికి పుచ్చుకున్న గ‌ద్ద‌ర్ విగ్ర‌హాన్ని ఏపీలో ఏర్పాటు చేయాల‌ని.. ఆయ‌న కుమార్తె వెన్నెల సీఎం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. బుధ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ నుంచి గుంటూరు జిల్లా ఉండ‌వ‌ల్లికి వ‌చ్చిన ఆమె.. సీఎం చంద్ర‌బాబును క‌లుసుకున్నారు. రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా తీరిక చేసుకున్న చంద్ర‌బాబు.. వెన్నెల‌తో భేటీ అయ్యారు. వాస్త‌వానికి ఉద‌యం నుంచి చంద్ర‌బాబు చాలా బిజీగా ఉన్నారు. ఉద‌యం డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో భేటీ అయ్యారు. త‌ర్వాత‌.. బీసీ సంక్షేమ శాఖ‌పై స‌మీక్షించారు.

ఈ కార్య‌క్ర‌మాల మ‌ధ్యలో గుంటూరులో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ప‌రిస్థితులు.. శాంతి భ‌ద్ర‌త‌లు వంటి అంశాల‌పై ఎప్ప‌టి క‌ప్పుడు ఉన్న‌తాధికారుల నుంచి వివ‌రాలు తెలుసుకుంటూ.. త‌గు సూచ‌న‌లు చే్స్తూ వ‌చ్చారు. దీంతో వెన్నెల ఎక్కువ సేపు నిరీక్షించాల్సి వ‌చ్చింది. అనంత‌రం సీఎం త‌న ఛాంబ‌ర్‌లోకి ఆమెను ఆహ్వానించి.. ప్ర‌త్యేకంగా సంభాషించారు. ఈ సంద‌ర్భంగా వెన్నెల త‌న మ‌న‌సులోని మాట‌ను సీఎంకు వివ‌రించారు. త‌న తండ్రి విగ్ర‌హాన్ని విజ‌య‌వాడ లేదా అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయాల‌ని.. కోరారు. విజ‌య‌వాడ‌తో త‌న తండ్రికి ఎంతో అనుబంధం ఉంద‌ని వివ‌రించారు.

అలానే.. విశాఖ‌లోని ప్ర‌తిష్టాత్మ‌క ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యంలోని క‌ళ‌లు-సంస్కృతి విభాగానికి గ‌ద్ద‌ర్ పేరు పెట్టాల‌ని వెన్నెల కోరా రు. విశాఖ‌తోనూ త‌న తండ్రికి ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌న్నారు. ఆయావిష‌యాల‌ను ఆస‌క్తిగా ఆల‌కించిన సీఎం చంద్ర‌బాబు.. గ‌ద్ద‌ర్ విగ్ర‌హ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన‌ట్టు వెన్నెల తెలిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆమె ఒక్క‌రే రావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. గ‌తంలో చంద్ర‌బాబు పాల‌నలో లోపాలు ఉన్నాయంటూ ప‌లు సంద‌ర్భాల్లో గ‌ద్ద‌ర్ విమ‌ర్శించారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఆయ‌న మృతి చెందిన‌ప్పుడు నివాళుల‌ర్పించారు.

Tags:    

Similar News