మండలివారి ఆవేదన.. రీజనేంటి?
దీనికి కారణం.. ఆయనలో ఉన్న ఆవేదనేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని బయట పెట్టేశారు.
మండలి బుద్ధప్రసాద్. సీనియర్ నాయకుడు, రాజకీయంగా వివాద రహితంగా కూడా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల సమయం వరకు ఆయన టీడీపీలో ఉన్నా.. టికెట్ ఆయనకు జనసేన నుంచి వచ్చింది. దీంతో ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. కానీ, రెండేళ్ల కాలంలో యాక్టివ్ పాలిటిక్స్ చేయలేక పోయారు. దీనికి కారణం.. ఆయనలో ఉన్న ఆవేదనేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని బయట పెట్టేశారు.
పనిచేసేవారికి ప్రాధాన్యం లేకుండా పోయిందని.. వ్యాఖ్యానించారు. అందుకే రాజకీయాలంటే విసుగు వస్తోందని అన్నారు. ఇదేసమయంలో ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. అయితే.. తన వారసుడిని ఆయన గత ఎన్నికల్లోనే నిలబెట్టాలని భావించిన నేపథ్యంలో ఇప్పుడు.. ఈ మాట చెప్పడం సంచలనం కాకపోవచ్చు. కానీ, ఆయన రాజకీయం అంటేనే విసుగు వస్తోందని చెప్పడం వెనుక ఖచ్చితంగా తనకు గుర్తింపు లేకుండా పోయిందన్న వాదన ఉందన్నది సుస్పష్టం.
ఏం ఆశిస్తున్నారు?
ప్రస్తుతం మండలి బుద్ధ ప్రసాద్.. శాసన సభ క్రమశిక్షణ సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. ఇది జనసేన ద్వారానే లభించిన పదవి. ఇక, పార్టీలోనూ ఆయనకు కార్యదర్శి పోస్టును ఇచ్చారు. కానీ, ఆయన ఆశిస్తు న్నది మంత్రివర్గంలో చోటు. కానీ, ఇది సాకారం కావడం లేదన్నది ఆయన ఆవేదన దీనికితోడు.. తన నియోజకవర్గంలో ఏర్పడిన.. ఓ వివాదం విషయం కూడా ఇంకా నలుగుతూనే ఉంది. దీనిని పరిష్కరించాలని ఆయన కోరుతున్నా.. అది సాధ్యం కావడం లేదు. ఇవన్నీ కలిసి ఆయనకు ఆవేదనను పెంచాయి.
ఇప్పటికిప్పుడు మంత్రిపదవి దక్కుతుందా? అంటే..కష్టమేనన్నది పరిశీలకులు చెబుతున్న మాట. కాపు సామాజిక వర్గంలో ఇప్పటికే కొందరు మంత్రులుగా ఉన్నారు. జనసేనలో ఇంకా ఈ కులానికి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి లేదు. పైగా కుల రహిత సమాజం, రాజకీయాల కోసం జనసేనాని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలికి మంత్రిపదవి దక్కడం అనేది అంత ఈజీకాదు. ఇదే ఆయనలో ఆవేదనను విస్మయాన్ని కలిగిస్తున్నాయన్నది వాస్తవమని అంటున్నారు పరిశీలకులు.