సర్ కి మిగిలింది కొన్ని గంటలే ...ఎవరికి టెన్షన్ ?
నెల రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్ళి ఎ న్యుమరేషన్ ఫారాలు అందించి ఓటర్ల నుంచి వివరాలు తీసుకోవడం వాటిని డిజిటలైజ్ చేయడం వంటి అతి ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది.
ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ సర్ మరి కొద్ది గంటలలో ముగియనుంది. దాంతో ఇంతటి కీలకమైన ప్రక్రియలో నాలుగు కోట్ల మందికి పైగా ఉన్న ఏపీ ఓటర్లలో ఎంతమంది పాల్గొన్నారు అన్నది ఆసక్తిని కలిగిస్తున్న అంశం. జూన్ 15న మొదలైన సర్ ప్రక్రియ జూలై 14తో ముగుస్తోంది. నెల రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్ళి ఎ న్యుమరేషన్ ఫారాలు అందించి ఓటర్ల నుంచి వివరాలు తీసుకోవడం వాటిని డిజిటలైజ్ చేయడం వంటి అతి ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది.
రోజుకు యాభై మంది :
ప్రతీ బీఎల్వోకు సగటున ఆరు వందల మంది ఓటర్లను అప్పగించారు. అంటే రోజుకు యాభై మంది ఓటర్ల వివరాలకు సేకరించి డిజిటలైజ్ చేయాలి అన్న మాట. ఒక విధంగా ఇది చెప్పినంత సులువు అయితే కాదు, ప్రజలు సహకరిస్తేనే ఈ ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడే ఓటర్ల చైతన్యం మీద మరో సారి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 2002లో తమ ఓటు ఉందో లేదో చూసుకోవడం, సర్ ప్రక్రియకు అవసరమైన సమాచారాన్ని తాము బాధ్యతగా ఇవ్వడం వంటివి ఓటర్లు చేయాల్సిన విధులు. ఇక బీఎల్వోలు ఫారాలు ఇవ్వకపోతే అడిగి తీసుకోవడం కూడా చేయడంలో తప్పు లేదు.
జరుగుతున్నదేంటి అంటే :
అయితే సర్ ప్రక్రియ మొత్తం నెల రోజుల పాటు సాగిన తీరు మీద ఓవరాల్ గా సమీక్షిస్తే కనుక గ్రామీణ ప్రాంతాలలో కొంత బాగా జరిగింది అని వార్తలు వస్తున్నాయి. అదే పట్టణాలలో అయితే సర్ ప్రక్రియ పట్ల జనాలలో ఆసక్తి అంతంతమాత్రమే ఉంది అని అంటున్నారు. ఓటు లేకపోతే ఏమిటి అన్న నిర్లక్ష్యమా లేక నిర్లిప్తతా లేక ఏ రాయి అయినా ఒక్కటే పళ్ళూడగొట్టుకునేందుకు అన్న వైరాగ్య మా తెలియదు కానీ పట్టణాలు నగరాలలో స్పందన తకువగా ఉంది అని లెక్క తేలుతోంది.
ఓటు లేకపోతే ఏమవుతుంది :
సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఇవ్వాల్సి ఉంటుంది. వాటితోనే ముసాయిదా జాబితాను తయారు చేసి జూలై 21న ప్రకటిస్తారు. అలా ముసాయిదా జాబితాలో కనుక ఓటర్ల పేర్లు వివరాలు ఎక్కినపుడే సవరణలకు వివరణలకు ఆస్కారం ఉంటుంది. తమ పేర్లు తప్పుగా వచ్చినా లేక వేరే అంశాల మీద ఫిర్యాదులు చేయాలన్నా అపుడే సాధ్యపడుతుంది. అలా కాకుండా అసలు ఎన్యుమరేషన్ ఫారం నింపకుండా పోతే ఏమి జరుగుతుంది అంటే ఓటర్లుగానే లేకుండా కాకుండా పోతారు అని అంటున్నారు. ఎవరైనా సరే ఓటర్ కనుక ఎన్యుమరేషన్ ఫామ్ నింపకపోతే ఓటు ఉండదు అని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మళ్ళీ ఓటు కోసం :
అలా ఎన్యుమరేషన్ ఫామ్ నింపకపోతే ఎన్నికల సంఘం ఈ నెల 21న ముసాయిదా జాబితా ప్రకటించిన దాంట్లో ఓటర్ల పేరు లేకుండా పోతుంది. మరి దానికి ఏమిటి పరిష్కారం అంటే ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలలో మళ్ళీ ఓటు కోసం కొత్తగా దరకాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం ఫారం 6 ని నింపి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అంతవరకూ పరిస్థితి తెచ్చుకోకుండా బీఎల్వోలు తమ వద్దకు వచ్చినపుడు కానీ లేదా తామే వారి వద్దకు వెళ్ళి కానీ ఎన్యుమరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వడమే మంచి అవకాశం అని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యం చేయబోతున్నారు :
రానున్న రోజులలో ప్రభుత్వాలు ఓటరు కార్డుని అన్ని విషయాలలో ముఖ్యం చేయబోతున్నారు అని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా లభించే ఏ పధకం అయినా లేదా ఏ కార్యక్రమం అయినా కూడా ఓటరుగా ఉన్నారా లేదా అన్నది ఇక మీదట చూడనున్నారు అని అంటున్నారు. అందువల్ల ఓటరుగా తమ బాధ్యతను నెరవేర్చాలి అంటే కచ్చితంగా సర్ ప్రక్రియలో ప్రతీ వారూ పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. మరి ఏపీలో నాలుగు కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. జూలై 14 తరువాత ఎంతమంది సర్ ప్రక్రియలో పాల్గొన్నారు అన్నది తెలుస్తుంది. ముసాయిదాలో ఓటర్లు ఎంత మంది అన్నది కూడా ఒక లెక్క వెల్లడి అవుతుంది అని అంటున్నారు.