సన్ ఆఫ్ అచ్చెన్న....టెక్కలిలో రెడీ !

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఒకటి రెండు సందర్భాలలో తప్ప ప్రత్యర్థి పార్టీలు ఎప్పుడూ అక్కడ నుంచి గెలిచింది లేదు.

Update: 2026-07-14 01:30 GMT

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఒకటి రెండు సందర్భాలలో తప్ప ప్రత్యర్థి పార్టీలు ఎప్పుడూ అక్కడ నుంచి గెలిచింది లేదు. ఇక టెక్కలిలో హరిశ్చంద్రాపురంలోని కొన్ని ముఖ్య మండలాలు కలిసిన తర్వాత అచ్చెన్నాయుడు అక్కడ నుంచి పోటీ చేస్తూ వచ్చారు. 2009లో ఆయన తొలిసారి పోటీ చేసినపుడు టెక్కలి నుంచి ఓటమి ఎదురైంది. కానీ 2014, 2019, 2024లలో వరసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించారు. ఇక అంతకు ముందు ఆయన హరిశ్చంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా 1996 ఉప ఎన్నికల్లో మొదటి సారి గెలిచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత 1999, 2004 లలో కూడా గెలిచారు.

మంత్రిగా చాన్స్ తో :

ఈ క్రమంలో అచ్చెన్నాయుడుకు 2014లో ఏపీలో ఏర్పడిన టీడీపీ మంత్రివర్గంలో అవకాశం దక్కింది అయిదేళ్ళ పాటు ఆయన మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. 2024 లో కూడా ఎంతో మంది సీనియర్లకు అవకాశం ఇవ్వకపోయినా అచ్చెన్నాయుడుకి మాత్రం మంత్రిగా అవకాశం ఇచ్చి కింజరాపు కుటుంబం మీద తమ అభిమానాన్ని చంద్రబాబు చాటుకున్నారు. ఇక 2029 ఎన్నికల కోసం తెలుగుదెశం పార్టీ ఇప్పటి నుంచే తగిన విధంగా వ్యూహ రచన చేస్తోంది. ఇక మీదట సీనియర్లకు బదులుగా జూనియర్లకే పెద్ద పీట వేయాలని పార్టీ చూస్తోంది అని అంటున్నారు.

ఈసారి వారసుడే అంటూ :

ఈ పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు వారసుడి మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అచ్చెన్నకు ఏడు సార్లు పార్టీ టికెట్లు ఇచ్చి అవకాశం కల్పించింది. అందులో ఆరు సార్లు ఆయన గెలిచారు. అంతే కాదు ఆయనను ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పార్టీ చేసింది. పొలిట్ బ్యూరోలో చోటు కల్పించింది. పార్టీ కోసం నోరు చేసుకుని గట్టిగా మాట్లాడడం అలాగే నిబద్ధతతో వ్యవహరించడం అచ్చెన్నకు ఉన్న సానుకూల అంశాలు అని అంటున్నారు. అయితే ఆయన సీనియర్ నేతగా పార్టీలో ఉన్నారు. అందువల్ల ఈసారి మాత్రం జూనియర్లకే చోటు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో తన కుమారుడు క్రిష్ణ మోహన్ నాయుడుని ముందు పెట్టి తాను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని అచ్చేన్నాయుడు చూస్తున్నారు అని అంటున్నారు.

జోరు చేస్తున్న వైనం :

ఇక టెక్కలిలో చూస్తే కనుక అచ్చెన్నాయుడు కుమారుడు క్రిష్ణ మోహన్ నాయుడు జోరు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యర్క్రమాలలో పాలు పంచుకుంటున్నారు అని అంటున్నారు. అలాగే కార్యకర్తలను కలుస్తూ వారికి బాగా దగ్గర అవుతున్నారు. అలాగే ప్రజా సమస్యల మీద కూడా పార్టీ పక్షాన నిలబడుతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఖాయమని అంటున్నారు. అచ్చెన్న మీద అభిమానంతో కుమారుడికి కచ్చితంగా టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇస్తుందని ప్రచారం అయితే సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు, అలాగే అచ్చెన్న కుమారుడు క్రిష్ణమోహన్ నాయుడు ఇద్దరూ శ్రీకాకుళం జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలకం అవుతారని అంటున్నారు. కింజరాపు రామక్రిష్ణులుగా యువ నేతలుగా వీరిదే రానున్న కాలం అని పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్న మాటగా ఉంది.

Tags:    

Similar News