వైఎస్ వేసిన రోడ్ల మీద న‌డ‌వ‌లేదా బాబు?

Update: 2017-06-25 16:54 GMT
త‌న‌కు ఓటు వేయ‌క‌పోతే పెన్ష‌న్లు తీసుకోవ‌ద్ద‌ని, రోడ్ల‌పై న‌డ‌వ‌వ‌ద్ద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన హెచ్చ‌రిక‌ల‌పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిప‌డ్డారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను త‌న సొంత ఘ‌న‌తగా చెప్పుకొంటూ వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు తీరు చిత్రంగా ఉంద‌ని రోజా వ్యాఖ్యానించారు. బాబు ఇప్పుడు నీతులు చెప్పే ముందు గ‌తంలోని అంశాల‌ను ఆలోచించుకోవాల‌ని అన్నారు. గ‌తంలో ప్రతిప‌క్షంలో ఉన్న‌పుడు దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వేసిన రోడ్ల మీద న‌డ‌వ లేదా అని రోజా సూటిగా ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై బాబు ఏమ‌ని స్పందిస్తార‌ని నిల‌దీశారు.

సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో బాబు వ్యాఖ్య‌ల‌ను చూస్తుంటే...ఆ సొమ్ములు ప్ర‌భుత్వ నిధుల నుంచి ఖ‌ర్చు చేస్తున్న‌ట్లుగా కాకుండా త‌న తండ్రి ఖ‌ర్జూర నాయుడు - మామ ఎన్టీఆర్ ఆస్తి నుంచి ఖ‌ర్చు చేస్తూ ఇస్తున్న‌ట్లుంద‌ని రోజా ఎద్దేవా చేశారు. త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంత‌రం రోజా మాట్లాడారు. బాబు కానీ ఆయ‌న కుమారుడు లోకేష్ కానీ అడ్డ‌దిడ్డంగా చేసిన అవినీతి ద్వారా వ‌చ్చిన సొమ్ముల‌తో ఈ పెన్ష‌న్‌లు ఏమైనా ఇస్తున్నారా అని రోజా నిల‌దీశారు. సంక్షేమ ప‌థ‌కాల్లో అవినీతికి పాల్ప‌డుతున్న బాబుకు వాటిని త‌న ఖాతాలో వేసుకోవ‌డంపై సిగ్గుప‌డాల‌ని అన్నారు. జ‌న్మ‌భూమి క‌మిటీల‌తో త‌న వాళ్ల‌కే ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు ద‌క్కేలా కుట్ర‌లు చేస్తున్నార‌ని రోజా మండిప‌డ్డారు.

గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను సైతం తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు ఉప‌యోగించుకున్నార‌ని దానిపై ఏం స‌మాధానం ఇస్తార‌ని రోజా ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు న‌డిచింది కూడా కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వేసిన రోడ్ల మీద‌నే క‌దా అని రోజా నిల‌దీశారు. ఇక‌నైనా ప్ర‌జా సంక్షేమ పాల‌న‌కు చంద్ర‌బాబు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, సామాన్యుల‌ను ఇబ్బందిపెట్ట‌కుండా చూడాల‌ని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News