'ఆ వీడియో నాది కాదు'... ఎంపీ సుధామూర్తి కీలక సూచన!
ఇటీవల కాలంలో నెట్టింట డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే.;
ఇటీవల కాలంలో నెట్టింట డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే. సరదా వీడియోల దగ్గర నుంచి ఆర్థిక పరమైన విషయాల వరకూ ఈ డీప్ ఫేక్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాజ్యసభ ఎంపీ సుధామూర్తికి సంబంధించిన వీడియో ఒకటి హల్ చల్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆ వీడియోపై ఎంపీ వివరణ ఇచ్చారు.
అవును... ఇటీవల రాజ్యసభ ఎంపీ సుధామూర్తికి చెందిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇందులో మాట్లాడుతున్న సుధామూర్తి.. పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లుగా ఉంది. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ఆ వీడియో తనది కాదని.. తాను పెట్టుబడులు పెట్టాలని చెప్పనని, ఇలాంటి వీడియోల మాయలో పడొద్దని స్పష్టం చేశారు.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో... తాను సూచించిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే అధిక రాబడులు వస్తాయని ఎంపీ సుధామూర్తి సూచిస్తున్నట్లుగా ఉంది. ఈ సందర్భంగా ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేయాలని కోరుతున్నట్లుగా ఉంది. పైగా.. ఇప్పటికే చాలామంది అలా చేసి నెలకు రూ.10 లక్షల వరకూ సంపాదిస్తున్నారని ఉంది.
ఈ నేపథ్యంలోనే సుధామూర్తి స్పందించారు. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. తాను పెట్టుబడులు పెట్టాలని ఎవరికీ ఎప్పుడూ సూచించనని.. ఇలాంటి వీడియోలు చూసి ఎవరూ మోసపోవద్దని కోరారు. ఈ సందర్భంగా.. ఇలాంటి వీడియోల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తన ముఖం, గొంతును ఉపయోగించి పెట్టుబడులను ప్రోత్సహించడానికి 20 లేదా 30 రెట్లు రాబడిని హామీ ఇచ్చే నకిలీ సందేశాల గురించి విని తాను నిజంగా ఆందోళన చెందుతున్నానని.. తాను ఎప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడనని.. తన ముఖం చూసి, తన గొంతు విన్న కూడా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు చెబితే నమ్మవద్దని.. కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉంచుకోమని సూచించారు.