వైఎస్ జగన్ బాబాయ్ మనవడు అరెస్ట్... ఏమిటీ కేసు!

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారందరిపైనా చర్యలు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.;

Update: 2025-12-19 10:19 GMT

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారందరిపైనా చర్యలు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అవును... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారనే కేసులో ప్రధాన నిందితుడైన సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డిని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి గతంలోనే అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. విదేశాలకు వెళ్ళాడు.

దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుడివాడ పోలీసులు అర్జున్ రెడ్డికి 41 ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆయన గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు రాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

వాస్తవానికి అర్జున్ రెడ్డిపై ఉమ్మడి కడప జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయి. కాగా.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బాబాయ్ వరసయ్యే వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే ఈ సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి.

ఇలా మార్ఫింగ్ కేసులో అర్జున్ రెడ్డి అరెస్టవ్వగా.. మరోవైపు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు కూనసాని వినోద్ ను పోలీసులు బెట్టింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నందుకు అతడిని గుడివాడ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో.. వినోద్ నుంచి రూ.50వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News