ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు: 'ఇప్పుడే అమ్మాయిలను పంపుతా'.. బయటపడ్డ దిగ్గజాల బండారం!
అమెరికాలో సంచలనం సృష్టించిన ఈ జెఫ్రీ ఎప్ స్టీన్ లైంగిక వేధింపుల కేసులో కొత్త ఆధారాలు బయటపడ్డాయి.;
జెఫ్రీ ఎప్ స్టీన్ ఉదంతం మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన ఈ లైంగిక నేరగాడికి సంబంధించిన మరిన్ని చీకటి కోణాలను ‘యూఎస్ హౌస్ డెమొక్రాట్ల కమిటీ’ తాజాగా వెలుగులోకి తెచ్చింది. విడుదలైన కొత్త ఫొటోలు, సందేశాలు ప్రపంచ కుబేరులు, మేధావుల ముసుగులను తొలగిస్తున్నాయి.
అమెరికాలో సంచలనం సృష్టించిన ఈ జెఫ్రీ ఎప్ స్టీన్ లైంగిక వేధింపుల కేసులో కొత్త ఆధారాలు బయటపడ్డాయి. జెఫ్రీ ఎప్ స్టీన్ కు చెందిన ప్రైవేట్ ఎస్టేట్ లో దొరికిన సుమారు 68 ఫొటోలను అమెరికా ప్రతినిధుల సభలోని డెమొక్రాట్ల కమిటీ బహిర్గతం చేసింది. ఈ ఫొటోల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తులు ఉండడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
లిస్టులో ఉన్న ప్రముఖులు వీరే..
తాజాగా విడుదలైన ఫొటోలలో కేవలం నేరగాళ్లే కాకుండా.. సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కనిపించడం విస్తుగొలుపుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రపంచ ప్రఖ్యాత భాషావేత్త నోవమ్ చోమ్స్కీ , ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లాంటి వారు ఉండడం చూసి అంతా షాక్ అవుతున్నారు. గతంలోనే వీరికి ఎప్ స్టీన్ తో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ తాజా చిత్రాలు ఆ బంధాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి.
గర్ల్స్ ఆన్ ది వే.. విస్తుగొలిపే సందేశాలు
ఫొటోలతో పాటు కొన్ని కీలకమైన చాటింగ్ స్క్రీన్ షాట్ లను కూడా కమిటీ బయటపెట్టింది. అందులో ‘నేను ఇప్పుడే అమ్మాయిలను పంపుతున్నాను’ అనే అర్థం వచ్చే సందేశాలు ఉన్నట్లు సమాచారం. ఇది ఎప్ స్టీన్ నడిపిన అంతర్జాతీయ సెక్స్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.
అంతేకాకుండా రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా వంటి దేశాలకు చెందిన మహిళల పాస్ పోర్టుల కాపీలు కూడా అక్కడ లభ్యమయ్యాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ మహిళల పేర్లను వివరాలను అధికారులు బ్లర్ చేశారు. తూర్పు యూరప్ దేశాల నుంచి యువతులను ప్రలోభ పెట్టి అమెరికాకు రప్పించి వారిని ప్రముఖుల కోసం వినిగించేవారని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి.
95 వేల చిత్రాల రహస్యం
అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. కమిటీ దగ్గర ఇప్పటివరకూ కేవలం కొన్ని పదుల ఫొటోలే కాకుండా సుమారు 95వేల ఇమేజెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఎప్ స్టీన్ ఎస్టేట్ లోని వివిధ పరికరాల నుంచి సేకరించినవి వీటిని పూర్తిగా విశ్లేషిస్తే మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
జెఫ్రీ ఎప్ స్టీన్ వందలాది మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో 2019లో అరెస్ట్ అయ్యాడు. అయితే విచారణ ఎదుర్కొంటుండగానే ఆయన జైలు గదిలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణించినా.. ఆయనతో సంబంధం ఉన్న రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల చిట్టా మాత్రం ఇంకా ప్రపంచాన్ని కుదిపేస్తూనే ఉంది.
తాజా ఆధారాలు అమెరికా రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలైట్ సర్కిల్స్ లో వణుకు పుట్టిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆ 95వేల చిత్రాల్లో ఇంకెంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో వేచిచూడాలి.