తమ్ముళ్లు సూదిగాళ్లంటున్న రోజా

Update: 2015-11-29 09:48 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా.. ఆ పార్టీ నేతల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు చేసే క్రమంలో తెలుగు తమ్ముళ్ల మీద నిప్పులు చెరిగారు. చివరకు సూదిగాళ్లు అంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు. ఏపీ ప్రజల్ని టీడీపీ సర్కారు అడ్డదిడ్డంగా దోచేస్తుందంటూ మండిపడిన ఆమె.. ఏపీ ముఖ్యమంత్రి 15 శాతం వృద్ధి రేటు సాధిస్తామని చెప్పటం హస్యాస్పదంగా అభివర్ణించారు.

ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించిన సమయంలో వృద్ధిరేటు సింగిల్ డిజిట్ దాటలేదని.. ఇప్పుడు అలా ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. దేశ వృద్ధిరేటు 7 శాతం ఉంటే.. ఏపీ వృద్ధిరేటు 15 శాతం ఎలా సాధ్యమని ప్రశ్నించిన ఆమె.. అసలు తెలుగుదేశం నేతలకు వృద్ధిరేటును ఎలా లెక్కించాలో తెలుసా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయం.. ఐటీ రంగం కుదేలయ్యాయయని చెప్పిన ఆమె.. ఏపీలో జరుగుతున్న పలు అంశాల్ని  ప్రస్తావించారు.

రైతుల ఆత్మహత్యలు.. అత్యాచారాలు.. మహిళల్ని కించపర్చటంతో పాటు.. జీతాలు పెంచమంటూ ఆందోళన చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తల మీద దారుణంగా లాఠీ ఛార్జ్ చేయించారని దుయ్యబట్టారు. తెలుగుదేశం నేతలు సూదిగాళ్లుగా తయారయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా ఎమ్మార్వోను నోటికొచ్చినట్లు తిట్టిన ప్రభుత్వ విప్ చింతమనేనిపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని.. అతడ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనకేసుకొచ్చారన్నారు.
Tags:    

Similar News