2029 ఎన్నికలు.. కవిత పెద్ద ప్లానింగే!

ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి;

Update: 2025-12-16 23:30 GMT

తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయిన కవిత.. 2029 సార్వత్రిక ఎన్నికలలో సామాజిక తెలంగాణను లక్ష్యంగా చేసుకొని తాము పోటీ చేస్తామని ప్రకటించడం ద్వారా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. కవిత ఎక్స్ వేదికగా నిర్వహించిన ఆస్క్ కవిత సెషన్ లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

2029 ఎన్నికల్లో పోటీ.. ప్రజల నుండే పార్టీ పేరు

కొత్త పార్టీ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు కవిత ఆసక్తికరంగా స్పందించారు. 2029 ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమని తేల్చిచెప్పారు. అంతేకాకుండా పార్టీ పేరును కూడా ప్రజలు సూచించిన దానినే పెడుతామని స్పష్టం చేశారు.

యువతకు ఉద్యోగ కల్పనే తొలి ప్రాధాన్యం

రాజకీయాల్లో తమ తొలి ప్రాధాన్యం యువతకు ఉద్యోగాల కల్పనే అంటూ కవిత తేల్చిచెప్పారు. మహిళలకు , యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడానికి జాగృతి కృషి చేస్తుందని వారికి నచ్చిన రంగాలలో రాణించేలా ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా కవిత పోరు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా కవితపై ఆరోపనలు వచ్చాయి.దాన్ని చెరిపేసే పనిలో తాజాగా రేవంత్ రెడ్డి పాలనను కవిత గట్టిగా టార్గెట్ చేశారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు చాలా బాధాకరమన్నారు. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ డ్రామాను ఖండించారు. త్వరలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇక తెలంగాణ జాగృతిని బలోపేతం చేసి త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కవిత ఈ సందర్భంగా తెలిపారు.

సింగరేణి, హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్

సింగరేణి సంస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్న కవిత, హెచ్ఎంఎస్ తో కలిసి ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ వెస్ట్ అభివృద్ధిపై చూపిన శ్రద్ధ ఈస్ట్ సిటీపైన లేదని.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ఇక కవితన వ్యక్తిగత అభిరుచులను పంచుకున్నారు. తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని అని స్పష్టం చేశారు. నటుడు రాంచరణ్ కూడా చాలా వినయంగా ఉండే మంచి డ్యాన్సర్ అని చెబుతూనే.. ఏదేమైనా చిరంజీవి తర్వాతే అంటూ కవిత వ్యాఖ్యానించారు.

కవిత ప్రకటనలు చూస్తే 2029 ఎన్నికల నాటికి తెలంగాణలో రాజకీయ సమతుల్యత మారే అవకాశం ఉందని సామాజిక న్యాయం, యువతకు ఉపాధి కల్పన అంశాలు ప్రధాన అజెండా మారనున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News