భారత్ కు, తమకు ఎంత తేడానో ఒప్పుకున్న పాక్.. సంచలన నివేదిక!

అది డిసెంబర్ 16 - 1971.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటు కాసేపట్లో జరగబోతోంది.;

Update: 2025-12-16 21:30 GMT

అది డిసెంబర్ 16 - 1971.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటు కాసేపట్లో జరగబోతోంది. ఆ సమయంలో ఢాకాలోని రామ్నా రేస్ కోర్సులో పాకిస్థాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ వణుకుతున్న చేతులతో భారత జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు లొంగిపోయి.. దానికి సంబంధించిన పత్రంపై సంతకం చేశారు. ఆ పక్కనే బంగ్లాదేశ్ ముక్తి బాహిని కమాండర్లు ఉన్నారు.

నియాజీ వెనుక సుమారు 93,000 మంది సైనికులు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిలుచున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ లోని నివాసితులు.. తమ పూర్వ హింసకులను చీల్చివేసేందుకు బారికేడ్లపైకి దూసుకుపోతున్నారు. మరోవైపు భారత జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇది ప్రపంచం మరిచిపోని, మరిచిపోలేని చరిత్ర. సరికొత్త దేశం ఏర్పాటుకు భారత్ సాయం అందించిన చరిత్ర!

ఆ సమయంలో తమ దేశంలో సగం మందిని వదులుకునేందుకు నియాజీ సంతకం చేస్తున్నారు. ఆ సమయంలో ఈ యుద్ధంలో అత్యంత కీలక భూమిక పోషించాల్సిన పాకిస్థాన్ సైనిక నియంత, కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ యాహ్యా ఖాన్ "జనరల్ రాణి" సమక్షంలో హ్యాంగోవర్ లో ఉన్నారనే విషయంపై కమిషన్ సంచలన విషయాలు వెల్లడించింది.

అవును... ఓ పక్క భారత్ చేతిలో ఘోర ఓటమి.. చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి.. దానికి తోడు దేశం రెండు ముక్కలుగా విడిపోతోన్న సమయం.. ఈ తీవ్ర దిగ్భ్రాంతికర పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ కొత్త నాయకుడు జుల్ఫికర్ అలీ భుట్టో.. "పాకిస్థాన్ తూర్పు పాకిస్థాన్ ను ఎందుకు కోల్పోయిందో కనుక్కోండి, బాధ్యులెవరో గుర్తించండి" అనే అజెండాలపై కమిషన్ ను ఏర్పాటు చేశారు.

ఈ సమయంలో.. ప్రధాన న్యాయమూర్తి హమూదుర్ రెహమాన్ ను విచారణ కమిషన్ కు నాయకత్వం వహించాలని కోరారు. కొత్త నాయకుడి కోరిక, ఆదేశాల మేరకు రెహమాన్ విచారణ మొదలుపెట్టారు. ఈ సమయంలో హముదూర్ రెహమాన్ కమిషన్ 1974లో తన ప్రధాన నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా ఆయన భయటపెట్టిన పలు విషయాలు అత్యంత షాకింగ్ గా మారాయి.

కమిషన్ ఏమి చెప్పింది..?:

ఈ సందర్భంగా హముదూర్ రెహమాన్ కమిషన్ తన నివేదికను సమర్పించింది! పాకిస్థాన్ ఘోర ఓటమిలో దాని జనరల్స్ విచ్చలవిడితనంతో మునిగిపోవడం కూడా ఓ కారణమని పేర్కొన్నారు! ప్రధానంగా గణనీయమైన సంఖ్యలో సీనియర్ ఆర్మీ అధికారులు అవినీతికి పాల్పడటమే కాకుండా.. విచ్చలవిడి జీవన విధానాలను కూడా అవలంభించారనే ఆరోపణల్లో వాస్తవం ఉందని తెలిపింది!

హ్యాంగోవర్ లో యాహ్యా ఖాన్!:

కమిషన్ నివేదిక.. ప్రధానంగా జనరల్ యహ్యా ఖాన్ గురించి తెలుసుకునేందుకు పలువురు సాక్ష్యులను విచారించినట్లు తెలిపింది! ఈ సందర్భంగా అతడు రాత్రులు విపరీతంగా మద్యం సేవించారని పలువురు కమిషన్ ముందు సాక్ష్యమిచ్చారు. దీంతో... దేశాధినేత కమాండ్స్ ను కాక్టెయిల్స్ మధ్య ఒక ఆలోచనగా పరిగణిస్తే ఫలితం ఇలానే ఉంటుందని చెప్పకనే చెప్పింది! ఈ సందర్భంగా జనరల్ రాణి విషయాన్ని కమిషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది!

ఎవరీ జనరల్ రాణి?:

ఇదే సమయంలో... యహ్యా నివాసంలో గేట్ కీపర్ నుంచి లోపల కింగ్ మేకర్ వరకూ అన్నీ తానై నడుచుకుంది జనరల్ రాణి అని పిలవబడే అక్లీం అక్తర్! యహ్యా ఖాన్ అత్యంత సన్నిహిత సహచరురాలు, నమ్మకస్తురాలుగా ఆమెకు పేరుందని కమిషన్ ఆరోపించింది. మంచంపై కబుర్లకు, విధానపర నిర్ణయాలకు మధ్య రేఖలను ఆమె అస్పష్టం చేసిందని అభిప్రాయపడ్డారు!

వాస్తవానికి హమూదుర్ రెహమాన్ కమిషన్ నివేదికలోని అత్యంత హేయమైన భాగాలలో ఆమె పేరును ప్రత్యేకంగా ప్రస్థావించకపోయినా... తదుపరి పాకిస్థానీ కథనాలు, 1971 పాక్ జాతీయ పురాణాలు ఆమె పాత్రను కీలకంగా మార్చాయి. వైన్, మహిళ, సె*క్స్ ఆ దేశాన్ని ఎలా రెండుగా మార్చడంలో కీలక భూమిక పోషించాయనే సత్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది!

భారత్ నుంచి కౌంటర్స్ ఇవే...!:

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... భారత్ సైన్యం దెబ్బకు భయపడో, లేక జరగని పెళ్లికి భాజాలు ఎందుకు (గెలవని యుద్ధానికి పోరాటం ఎందుకు!) అని భావించో.. ఏకంగా ఆ దేశ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ యాహ్యా ఖానే తాగి పడుకున్న పరిస్థితి అని స్వయంగా ఆదేశ ప్రధాన న్యాయమూర్తి నివేదిక ఇవ్వడం. ఇది వారికి, మన సైన్యానికి మధ్య ఉన్న నిబద్ధత, క్రమశిక్షణలో తేడాను చెప్పకనే చెబుతుందంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

ఇదే సమయంలో... కమాండర్ ఇన్ చీఫ్ తో పాటు ఎంతోమంది ఆర్మీ అధికారులు సైతం విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారంటే... భారత్ సైన్యం దెబ్బకు పాక్ రెండు ముక్కలు అవుతుందని ముందే గ్రహించి.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉండోచ్చు.. లేదా.. ఉన్న నాలుగు రోజులైన ఎంజాయ్ చేసేద్దామని భావించి అయినా ఉండొచ్చని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

ఏది ఏమైనా సరిగ్గా 54 సంవత్సరాల క్రితం ఇదే రోజు.. పాక్ పెద్దల చేతులు వణికాయి.. బంగ్లా కమాండోల చేతులు కట్టుకున్నాయి.. భారతదేశపు జవాన్ రొమ్ము విరుచుకుని నిలబడిన క్షణాన్ని.. ఎవరూ చెరపలేరు, వక్రీకరించనూ లేరు.

Tags:    

Similar News