భారత్ ను బెదిరిస్తోన్న బంగ్లా... తెరపైకి 'సెవన్ సిస్టర్స్' టాపిక్!

ఇది వాస్తవం. అలాంటి భారత్ పై తాజాగా అవాకులు చెవాకులూ పేలుతూ.. సరిహద్దుల్లో ఉన్న సెవన్ సిస్టర్స్ గురించి కారు కూతలు కూస్తున్నాడు బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువనేత!;

Update: 2025-12-17 00:30 GMT

పాకిస్థాన్ తూర్పు కమాండ్ చేతిలో చిత్రవధలు అనుభవిస్తూ.. నెలల తరబడి పోరాడుతూ.. ఆఖరికి భారత్ సైన్యం ధైర్య సాహసాలతో సహకరించి ప్రాంత బిక్ష పెడితే.. డిసెంబర్ 16 - 1971న బంగ్లాదేశ్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఇది వాస్తవం. అలాంటి భారత్ పై తాజాగా అవాకులు చెవాకులూ పేలుతూ.. సరిహద్దుల్లో ఉన్న సెవన్ సిస్టర్స్ గురించి కారు కూతలు కూస్తున్నాడు బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువనేత!

అవును... బంగ్లాదేశ్ కు ప్రాంత బిక్ష పెట్టిన భారత్ పై ఆ దేశానికి చెందిన ఓ యువ నాయకుడు అవాకులూ చెవాకులూ పేలాడు. ఇందులో భాగంగా.. ఆ దేశంలో కొత్తగా ఏర్పడిన నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు హస్నత్ అబ్దుల్లా.. బంగ్లాదేశ్ అస్థిరతకు కారణమైతే, సెవన్ సిస్టర్స్ ను కట్ చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ ఘాటుగా స్పందించారు.

ఢాకాలోని సెంట్రల్ షహీద్ మినార్ వద్ద జరిగిన సభలో ప్రసంగించిన అబ్దుల్లా.. బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం, సామర్థ్యం, ఓటింగ్ హక్కు, మానవ హక్కులను గౌరవించని శక్తులకు మీరు అవకాశం కల్పిస్తే.. బంగ్లాదేశ్ ప్రతిస్పందిస్తుందని తాను భారత్ కు స్పష్టం చేయాలనుకుంటున్నానని.. ఇందులో భాగంగా ఏడుగురు సోదరీ మణులను దూరం చేసే అవకాశం ఉందని తెలిపారు.

ఇదే సమయంలో.. బంగ్లాదేశ్ అస్థిరమైతే దాని ప్రతిఘటన అగ్ని సరిహద్దులను దాటి వ్యాపిస్తుందని హెచ్చరించిన అబ్దుల్లా.. స్వాతంత్ర్యం వచ్చిన 54 సంవత్సరాల తర్వాత కూడా బంగ్లాదేశ్ పై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తున్న రాబందుల ప్రయత్నాలను ఎదుర్కొంటూనే ఉందని తెలిపారు.

ఏడుగురు సోదరీమణులు!:

కాగా... అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలను సెవన్ సిస్టర్స్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. ఇక అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో భూ సరిహద్దును పంచుకుంటాయి. ఇది ఈ ప్రాంతం సున్నితత్వాన్ని హైలెట్ చేస్తుంటుంది!

స్పందించిన అస్సాం సీఎం!:

ఇలా.. బంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పడిన నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. ఇందులో భాగంగా... భారత్ లోని ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్ తో విలీనం చేయాలనే ఆలోచనను ప్రమాదకరమైనదని అభివర్ణించారు. ఇటువంటి ప్రకటనలపై భారతదేశం మౌనంగా ఉండదని హెచ్చరించారు.

Tags:    

Similar News