పూసపాటి వారికి సరిసాటి వారే సుమా !

విద్యా దానం అన్ని దానాలలో ఎంతో విలువైనది వెలకట్టలేనిది అని చెబుతారు. అలాంటి దానాలను ఎన్నో చేసిన ఘనత విజయనగరం పూసపాటి సంస్థానాధీశులది.;

Update: 2025-12-17 01:30 GMT

విద్యా దానం అన్ని దానాలలో ఎంతో విలువైనది వెలకట్టలేనిది అని చెబుతారు. అలాంటి దానాలను ఎన్నో చేసిన ఘనత విజయనగరం పూసపాటి సంస్థానాధీశులది. వారిది అయిన వందల వేల ఎకరాలు ఆ విధంగానే దానం చేస్తూ వచ్చారు. విజయనగరం విశాఖలలో వారికి లెక్కకు మిక్కిలిగా భూములు ఉన్నాయి. అయితే అవన్నీ వ్యాపార వాణిజ్య ప్రయోజం కోసం కాకుండా ప్రజల కోసం వారి ప్రయోజనాల కోసం వినియోగిస్తూ అవసరమైన పక్షంలో వితరణ చేసేందుకు సైతం వెనకాడని గొప్ప గుణం పూసపాటి రాజులది.

వందల ఎకరాలు అలా :

పూసపాటి రాజులు ఇప్పటి ఏడు దశాబ్దాల క్రితం మాన్సాస్ ట్రస్ట్ ద్వారా విద్య దానంతో పాటు ఇతర సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. తమకు ఉన్న కోటలను మేడలను ఖాళీ ప్రదేశాలను విద్యా సంస్థలకు అందించారు. తామే స్వయంగా విద్యాలయాలను స్థాపించి ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పించారు. అలాంటి పూసపాటి వంశీకుడు, ప్రముఖుడు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలను చూసిన అశోక్ గజపతి రాజు ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉన్నారు ఆయన ఇపుడు ఉత్తరాంధ్రాలో మరో మహోన్నతమైన విద్యా సంస్థ కోసం ఏకంగా 130 ఎకరాలకు పైగా మాన్సాస్ ట్రస్ట్ భూములను అందించేందుకు ముందుకు వచ్చారు. ఇది నిజంగా గొప్ప విషయంగా చెబుతున్నారు.

వేలాది ఎకరాలు ప్రజల కోసం :

ఇదిలా ఉంటే ప్రజల కోసం ఏకంగా వేలది ఎకరాలను అందించిన గొప్ప వంశీయులు పూసపాటి వారు అన్నది అంతా కొనియాడుతున్న విషయంగా ఉంది. విశాఖ జిల్లా భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గం అన్నవరం గ్రామంలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి కావాల్సిన భూమి విషయంలో అంతా ఆలోచిస్తున్న సమయంలో అక్కడ మాన్సాస్ ట్రస్ట్ కు ఉన్న భూములని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పూసపాటి వంశీకులు చెప్పడం గొప్ప విషయంగా అంతా అంటున్నారు. తమ ప్రాంతంలో వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్ ను తీసుకు వస్తే తాము ఉచితంగా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన వారుగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఉన్నారని కూటమి నేతలు మంత్రులు కొనియాడుతున్నారు.

రూపాయికి సైతం నో :

ఇదిలా ఉంటే ఈ ఎంవోయూ ఫైల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో సీఎం సెక్రటరీ ఉచితంగా భూమి ఇస్తున్నారని ఫైల్ లో ఉందని, ఇది సాధ్యం కాదని పేర్కొన్నారుట. కనీసంగా టోకెన్ అమౌంట్ కానీ, రూపాయి అయినా కట్టాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దానికి విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వందల ఎకరాల స్థలం వితరణకు బదులుగా కనీసం రూపాయి కూడా తీసుకోవడానికి అంగీకరించలేదు. అలా పూసపాటి వంశీకులు 130 ఎకరాలను ఉచితంగా అందించారు. దీంతో ఉత్తరాంధ్రాలో అతి పెద్ద ఏవియేషన్ రంగంలో ఎడ్యుకేషన్ సిటీ రాబోతోంది. మొత్తానికి ఉత్తరాంధ్రా అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులుగానే కాకుండా దాతలుగా కూడా పూసపాటి వంశీకులు తమ ఉద్దాతర్వాన్ని నిరూపించుకుంటున్నారని అంటున్నారు అంతా వారిని కొనియాడుతున్నారు ఈ ఎడ్యుకేషన్ సిటీ వల్ల ఏవియేషన్ రంగంలో ఎన్నో ఉద్యోగాలు కూడా వచ్చేందుకు రానున్న రోజులలో అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News