బడ్జెట్‌కు ముందు కూటమి ప్రభుత్వానికి ఈ రెండే సమస్య.. !
త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే విధంగా శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభం అవుతున్నాయి.;
త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే విధంగా శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభం అవుతున్నాయి. వచ్చే నెల 11వ తారీకు నుంచి ప్రారంభమయ్యే ఈ బడ్జెట్ సమావేశాలు రెండు రకాలుగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకటి సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేల ను ఏం చేస్తారు? అనే అంశం కీలకంగా మారింది. గడిచిన ఆరేడు మాసాలుగా ఈ విషయాన్ని అటు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నారు.
మరోవైపు ఎథిక్స్ కమిటీ కూడా ఈ విషయంపై తీవ్రంగా అంతర్మథనం చెందుతోంది. ఎథిక్స్ కమిటీలో సభ్యులు ఇప్పటికే రెండుసార్లు బేటి అయ్యారు. వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సభకు రాకపోవడాన్ని తప్పుపడుతూ వారిని ఏం చేయాలన్న అంశంపై వీరంతా చర్చించారు. కానీ ఎటూ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఈ క్రమంలో ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాలను సీరియస్ గా తీసుకొని సభకు హాజరయ్యేలా వారిని ఒప్పించాలి అన్నది ఒక అంశం.
అయితే మరొకటి.. ఈ అంశాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లి ప్రజలే తేల్చుకునేలాగా చర్చ పెట్టాలన్నది మరొక ఆలోచన. అంటే.. ప్రజల సొమ్మును జీతాలుగా, భత్యాలుగా తీసుకుంటూ.. ప్రజల సమస్యలపై ప్రస్తావించేందుకు సభకు రావడం లేదన్న విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలన్నది ప్లాన్. ఇలా అసెంబ్లీ విషయంలో ఒక చర్చ తెర మీదకు వచ్చింది. ఇక రెండో విషయానికి వస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నలుగురి విషయం ఇంకా ఎటూ తేలలేదు.
హైకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ శాసన మండలి చైర్మన్ ఇప్పటివరకు ఆ నలుగురి విషయాన్ని పెండింగ్లోనే ఉంచారు. దీంతో వారు ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ఒక ప్రశ్నగా మారింది. రాజీనామా చేసామని వాళ్లు చెబుతున్నారు.. కానీ ఇటు చైర్మన్ మాత్రం వాటిని ఆమోదించలేదు. దీనికి పర్టిక్యులర్ కారణం కూడా ఆయన చెప్పకపోవడం అటువైపు హైకోర్టు ఆయనకు సమయం ఇవ్వడం ఇవన్నీ చూస్తే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉంటుందా ఉండదా అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా ఈ రెండు అంశాలు బడ్జెట్ సమావేశాల ముందు చర్చకు వస్తున్నాయి. మరి ఏం చేస్తారు? అనేది చూడాలి.