'పెట్టుబడులపై' కుట్ర: 1995 బాబు ఏడీ.. ?
ఏపీలో జరుగుతున్న పరిణామాలు.. రాష్ట్రానికి పరిమితం కావడం లేదు. దేశం మొత్తం వ్యాపిస్తున్నాయి.;
ఏపీలో జరుగుతున్న పరిణామాలు.. రాష్ట్రానికి పరిమితం కావడం లేదు. దేశం మొత్తం వ్యాపిస్తున్నాయి. అంతేకాదు.. జాతీయస్థాయిలోనూ చర్చకు వస్తున్నాయి. తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జాతీయ మీడియాలోనూ గంటల తరబడి చర్చ జరిగింది. దీనికి ముందు తిరుమల లడ్డూ ప్రసాదం, రాజకీయ వివాదాలు, ఘర్షణలు.. పోలీసుల వ్యవహార శైలి.. ఇలా అనేక అంశాలు జాతీయస్థాయిలో చర్చకు వస్తున్నాయి.
కొన్నికొన్ని ఘటనలు.. బీబీసీలోనూ ప్రసారం అయ్యాయి. అంతిమంగా ఇవి.. రాష్ట్ర ప్రజలపై కంటే.. కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుబడులపైనే ప్రభావం చూపిస్తాయన్న కంక్లూజన్ వస్తోంది. మెజారిటీ మేధావులు, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పెట్టుబడులు పెట్టేవారు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కోరుకుంటారు. తమ పెట్టుబడులకు భద్రత, అదేసమయంలో రక్షణ కూడా చూస్తారు. కానీ.. వైసీపీ నాయకులు కావొచ్చు.. సొంత నేతల వ్యవహారం కావొచ్చు.. ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది.
మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు పెట్టుబడుల లక్ష్యాలకు ఇవి విఘాతం కలిగిస్తున్నాయన్నది వాస్తవం అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత 18 మాసాల్లో ఊరూ వాడా తిరిగి.. చేసుకున్న 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు.. సాకారం అయ్యేది ఈ ఏడాదే. ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన సంస్థలను రాబట్టుకునేది.. ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించేది ఈ సంవత్సరమే.
ఇలాంటి కీలక సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రభుత్వం కఠినంగా అణిచి వేయాల్సిన అవసరం ఉంది. గతంలో గంజాయి బ్యాచ్ కుర్రాళ్లను నడిరోడ్డుపై ఎలా అయితే.. శిక్షించి.. మరింత మందిని దాని జోలికి పోకుండా చేశారో.. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసేవారిని ``ఇక చేయం మహా ప్రభో`` అని అనిపించారో(సినీ వర్గాల నుంచి రాజకీయ నేతల వరకు) అలాంటి దే రాజకీయంగా కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 1995ల నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించాలని కూడా మెజారిటీ ప్రజలు కోరుతున్నారు.