రాయిటర్స్ సంచలన కథనం.. మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటు పరం

Update: 2021-02-16 05:30 GMT
కారణం ఏదైనా.. ప్రభుత్వ రంగ సంస్థల్ని అదే పనిగా అమ్మేసే కార్యక్రమాన్ని ఉద్యమం మాదిరి మోడీ సర్కారు చేపట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎల్ఐసీ.. భారత రైల్వేలు.. ఎయిరిండియా.. టెలికాం.. మొన్నటికి మొన్న విశాఖ ఉక్కుతో పాటు.. హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్.. ఇలా పలు సంస్థల్నిప్రైవేటు పరం చేస్తున్న మోడీ సర్కారు.. తాజాగా నాలుగు బ్యాంకుల్ని ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమవుతోంది.

వచ్చే ఏడాది ప్రతిపాదించిన వ్యయ అంచనాలకు చేరుకునేందుకు తన దగ్గరున్న సంస్థల్ని ఎడాపెడా అమ్మేసేందుకు వీలుగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని అమ్మేసేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. తాజాగా మోడీ సర్కారు పెట్టుబడులు ఉపసంహరించుకొని.. ప్రైవేటుకు పట్టం కట్టాలని భావిస్తున్న బ్యాంకుల విషయానికి వస్తే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలుగా చెబుతున్నారు.

ఆయా బ్యాంకుల్లో పని చేస్తున్న ఉన్నత ఉద్యోగులే బ్యాంకు అమ్మకాల గురించిన సమాచారాన్ని తమకు ఇచ్చినట్లుగా రాయటర్స్ సంస్థ పేర్కొంది. బ్యాంకుల ప్రైవేటీకరణ వేలాది మంది ఉద్యోగులతో ముడిపడి ఉన్నందున.. తొలుత చిన్న తరహా బ్యాంకుల మీద ఫోకస్ పెట్టి.. తర్వాత ఇతర బ్యాంకుల అమ్మకాలను చేపడతారని చెబుతున్నారు. రానున్న కొన్నేళ్లలో పెద్ద బ్యాంకుల్ని కూడా ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనలో మోడీ సర్కారు ఉన్నట్లుచెబుతుున్నారు.

ప్రస్తుతం మోడీ సర్కార్ అమ్మాలనుకుంటున్న నాలుగు బ్యాంకుల ఉద్యోగుల సంఖ్య  1.22 లక్షలు. ఇందులో అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50వేల మంది.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33వేల మంది.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 26వేల మంది.. బ్యాంక్ఆఫ్ మహారాష్ట్రలో 13వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటుకు అమ్మాలని భావిస్తున్న బ్యాంకుల వ్యవహారాన్ని షురూ చేసేందుకు మరో ఐదారు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే.. బ్యాంకుల ప్రైవేటీకరణ చివరి నిమిషంలో అయినా ఆగిపోయే అవకాశం ఉందన్నారు. ఏమైనా.. ఇటీవల మోడీసర్కారు తీసుకుంటున్న వరుస నిర్ణయాలు చూస్తుంటే.. సేల్ సర్కార్ గా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News