అప్పట్లో వైఎస్.. ఇప్పుడు చంద్రబాబు.. కెరీర్ లో గోల్డెన్ చాన్స్!
దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాల పునర్విభజన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గోల్డెన్ చాన్స్ గా అభివర్ణిస్తున్నారు.;
దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాల పునర్విభజన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గోల్డెన్ చాన్స్ గా అభివర్ణిస్తున్నారు. 2009లో ఇలాంటి అవకాశాన్నే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వినియోగించుకున్నారని, అలాంటి అవకాశం ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు దక్కిందని అంటున్నారు. చంద్రబాబు ఈ అవకాశాన్ని చంద్రబాబు ఎలా వాడుకుంటారనేది ఆయన రాజకీయ చతురతపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. 2009లో వైఎస్ పునర్విభజనను వ్యూహాత్మకంగా వాడుకుని రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు వైఎస్ మాదిరిగా పునర్విభజనను సమర్థంగా వినియోగించుకుని మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? లేక ఆయన పార్టీకి పటిష్టమైన పునాదులు వేస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.
వచ్చేఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. ఈ అంశంపై రాజకీయంగా అనేక రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా 2009లో జరిగిన పునర్విభజనతో పోల్చుతూ కొద్దిరోజుల్లో మొదలయ్యే ఈ ప్రక్రియపై విశ్లేషకులు పలు విధాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు కెరీర్ చివరిలో కేంద్రం అరుదైన అవకాశం ఇచ్చిందని, ఇది ఆయన వినియోగించుకునే విధానంపై టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటున్నారు.
2009లో చేపట్టిన పునర్విభజన సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు తొమ్మిదేళ్లు పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయనకు గానీ, ఆయన పార్టీ తెలుగుదేశానికి కానీ ఇలాంటి అవకాశం దక్కలేదు. 1983లో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత అసలు డిలిమిటేషన్ ప్రక్రియ జరగలేదని చెబుతున్నారు. దీంతో 2009 డిలిమిటేషన్ ప్రక్రియ రాజకీయంగా అప్పటి ప్రభుత్వానికి ఒక అవకాశంగా మారిందని అంటున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు అనుకూలమైన రాజకీయ సమీకరణలతో నియోజకవర్గాలను ఏర్పాటు చేశారని అంటున్నారు.
వైఎస్ వ్యూహాత్మకంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగేలా చూడటంతో అప్పట్లో టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు చెల్లాచెదురయ్యాయని, బలమైన రాజకీయ ప్రత్యర్థులు ఉన్న నియోజకవర్గాలను రిజర్వు కేటగిరీకి మార్చి దెబ్బ తీశారని అంటున్నారు. దీంతో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలాచోట్ల పైచేయి సాధించలేకపోతోందని విశ్లేషిస్తున్నారు. వైఎస్ ఎత్తుగడలను అప్పట్లో విపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకోలేకపోయారని, ఫలితంగా 2009 ఎన్నికల్లో చంద్రబాబు వరుసగా రెండోసారి అధికారానికి దూరంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు, చంద్రబాబుకు మంచి అవకాశం వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతోపాటు కొత్త నియోజకవర్గాలు కూడా పెరుగుతుండటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సానుకూల అంశంగా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా బలంగా ఉండేలా ఈ అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో వైఎస్ అనుసరించిన రాజకీయ వ్యూహాన్నే తిరిగి చంద్రబాబు అమలు చేసే పరిస్థితే ఎక్కువ ఉందని అంటున్నారు. ఈ అంశం విపక్షం వైసీపీకి తీవ్ర నష్టం చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వైసీపీ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాలకు చెక్ పెట్టే విధానమే ఆ పార్టీకి శ్రీరామ రక్షగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ కు డిలిమిటేషన్ ప్రక్రియ మరోసారి వేదిక అవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.