జనంలోకి జీవన్ రెడ్డి... రేవంత్ మీద అసంతృప్తి రాజేయడమేనా ?

కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని వదులుకుని సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బయటకు వచ్చారు.;

Update: 2026-03-27 18:31 GMT

కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని వదులుకుని సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బయటకు వచ్చారు. ఆయన మార్చి 25న కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టారు. జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డికి నాలుగున్నర దశాబ్దాల రాజకీయం. ఆయన ప్రభవం రెండు మూడు జిల్లాలకు ఉంది. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో ఆయన బయటకు వచ్చారూ అంటే అది వ్యూహాత్మకమనే అని అంటున్నారు.

చేరేది ఎపుడంటే :

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారు అని అంతా అనుకున్నారు. ఇలా కాంగ్రెస్ నుంచి రావడమేంటి అలా కారు ఎక్కేస్తారు అని కూడా ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అయితే అదంతా తప్పు అన్నట్లుగా జీవన్ రెడ్డి తాజాగా వివిధ మీడియా చానళ్ళకు ఇస్తున్న ఇంటర్వ్యూలను బట్టి అర్ధం అవుతోంది. ఆయన తాను ఏ పార్టీలో చేరేదీ చెప్పడం లేదు, ఆ విషయం మాత్రం ఆయన దాట వేస్తున్నారు. తాను ప్రజా సమస్యల మీద పోరాడుతాను అని అంటున్నారు. జనంలోకి వెళ్తాను అని అంటున్నారు. తాను కాంగ్రెస్ ని వదిలాను తప్పించి జనాన్ని వారి సమస్యల మీద పోరాటాలని కాదని అంటున్నారు.

టార్గెట్ ఆయనే :

ఇక జీవన్ రెడ్డి టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన మాటలను బట్టి అర్ధం అవుతోంది. ఆయన కూడా సీఎం మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో ముప్పయి నెలల అధికారం ఉందని అయినా సరే తాను ఆ పార్టీని వదిలాను అంటే అది కాంగ్రెస్ లో కొంతమంది కారణం అన్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే తాను పార్టీని వదలలేదని పనిగట్టుకుని తనను కనగ్రెస్ నుంచి బయటకు నెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ని రాజీనామా చేయడం తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు అని అయినా అది అనివార్యం అయిందని ఆయన అంటున్నారు. తన రాజకీయానికి కాంగ్రెస్ లో బ్రేకులు వేసిన వారు ఉన్నారని రేవంత్ మీద పరోక్ష కామెంట్స్ చేశారు.

అదే ఎత్తుగడతో :

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం అంటే కుదరదు, అదే బయటకు వస్తే తీవ్రంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద విమర్శించవచ్చు. అంతే కాదు జీవన్ రెడ్డి నిన్నా మొన్నటి నేత అయితే కాదు, సీనియర్ మోస్ట్ లీడర్. దాంతో ఎంతో మంది ఆయనకు సన్నిహితులు ఉన్నారు. వారందరితో ఆయనకు అండదండలు తెర వెనక నుంచి ఉంటాయా అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు జీవన్ రెడ్డి ఒక్కరు బయటకు వచ్చారు ఎంతమంది ఇంకా రేవంత్ రెడ్డి మీద అసంతృపితో పార్టీలో కొనసాగుతున్నారు అన్నది కూడా తేలాల్సి ఉంది. బయట రాజకీయ సన్నివేశం ఎలా ఉంది అన్నది చూసుకోవడానికి జీవన్ రెడ్డి జనంలోకి వెళ్తాను అని అంటున్నారు. అనుకూలంగా సీన్ ఉంటే మరింత మంది కాంగ్రెస్ సీనియర్లు ఆయన వెంట నడిచే అవకాశం ఉంది అని అంటున్నారు.

పెను సవాల్ గానే :

ఇప్పటిదాకా కాంగ్రెస్ లో అసంతృప్తి ఎంత ఉందో ఎవరికీ తెలియదు, రేవంత్ రెడ్డి కూడా అంతా బాగుందని అన్నట్లుగా సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు ఇక విపక్షాల విమర్శలకు ఆయన తేలికగానే తీసుకుంటూ గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో పాతుకుపోయి ఎన్నో పదవులు నిర్వహించి వచ్చిన జీవన్ రెడ్డి లాంటి వారు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి మీద విమర్శలు గట్టిగా ఎక్కుపెడితే మాత్రం అది కష్టమే అవుతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ లో సీనియర్లకు అన్యాయం జరుగుతోంది అని అంటూ జీవన్ రెడ్డి చెప్పడమే కాదు రేవంత్ మీద టీడీపీ ముద్రను బలంగా వేయడానికి చూస్తే మాత్రం అది ఇంకా ఇరకాటం అవుతుంది అని అంటున్నారు.

బయట వారికి జవాబు చెప్పడం వేరు, పార్టీలో ఉంటూ బయటకు వెళ్ళి ఎదురు నిలిచిన వారికి చెప్పడం వేరు అని అంటున్నారు. మొత్తానికి చెవిలో జోరీగ మాదిరిగా జీవన్ రెడ్డి ఉండబోతున్నారు అని అంటున్నారు. అయితే ఏడున్నర పదుల వయసులో ఉన్న జీవన్ రెడ్డి ఓల్డ్ స్కూల్ పాలిటిక్స్ చేసే ఆయన 57 ఏళ్ళ వయసు కలిగిన రేవంత్ రెడ్డిని ఢీ కొట్టడం అంటే కొంత కష్టమే అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ లో కనుక ఒకసారి అసంతృప్తిని రాజేయగలిగితే పరిణామాలు వేగంగా మారుతాయి. బహుశా అదే ధీమాతో జీవన్ రెడ్డి బయటకు మొదటగా తాను వచ్చారు అని అంటున్నారు.

Tags:    

Similar News