రిజర్వేషన్ల లెక్క మారుతుందా?.. ఎస్సీ, ఎస్టీ స్థానాలు ఎన్ని అంటే..
నియోజకవర్గాల పునర్విభజన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కొత్తగా 88 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.;
నియోజకవర్గాల పునర్విభజన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కొత్తగా 88 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజన పూర్తి చేసి, కొత్త నియోజకవర్గాలతోనే ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం నిర్ణయించడంతో రాజకీయంగా వాడివేడి చర్చలకు కారణమవుతోంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పులు? కొత్తగా ఆయా వర్గాలకు రిజర్వు అయ్యే నియోజకవర్గాలపై లెక్కలు వేస్తున్నారు. కూడికలు, తీసివేతలతో నేతలు బిజీగా కనిపిస్తున్నారు.
చట్టసభలలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దీంతో ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలలో మొత్తం 36 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలుగా ప్రకటించారు. ఇందులో 29 ఎస్సీలకు 7 ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇక కొత్తగా 88 స్థానాలు పెరుగుతుండటంతో ఎస్సీ, ఎస్టీ స్థానాలు కూడా రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్ట ప్రకారం డిలిమిటేసణ్ తర్వాత ఎస్సీలకు దాదాపు 45 స్థానాలు రిజర్వు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా ఎస్టీలకు ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్య 12కి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వు చేసిన స్థానాలు దాదాపు ప్రతి జిల్లాలో ఉండగా, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు చొప్పున కేటాయించారు. అదేసమయంలో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు ఎక్కువగా ఉత్తరాంధ్రకే పరిమితం చేశారు. పోలవరం జిల్లా పరిధిలోని రంప చోడవరం తప్ప మిగిలిన ఆరు ఎస్టీ నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గానికి ఎస్టీలకు కేటాయించారు.
అయితే తాజాగా ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆయా స్థానాలను ఆశిస్తున్నవారు, ప్రస్తుతం సిట్టింగు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు తీవ్ర ఉత్కంఠను అనుభవిస్తున్నారు. కొత్తగా 88 నియోజకవర్గాలు వస్తుండటం వల్ల ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని అంటున్నారు. దీంతో నేతలు తమ అనువైన నియోజకవర్గాల ఏర్పాటు కోసం లెక్కలు వేసుకుంటున్నారు.
ఇదే సమయంలో కొందరు సీనియర్ నేతలు తమకు పట్టున్న ప్రాంతాలను రిజర్వేషన్ కేటగిరీలో పెట్టడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అటువంటి వారు ఇప్పుడు తమకో సువర్ణావకాశం లభించిందని, తమ నియోజవర్గాన్ని రిజర్వేషన్ కేటగిరీ నుంచి తప్పించి జనరల్ చేసుకోవాలని ముందు నుంచే పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంటుండగా, పునర్విభజన ప్రక్రియ మొదలు కావడం కూడా అధికార పార్టీ నేతలు అనుకూలంగా భావిస్తున్నారు. తమకు అనువైన నియోజకవర్గాలను ఎంచుకుని ఎన్నికలకు సిద్ధం కావడం చాలా సులువుగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.