ప్ర‌పంచ బ్యాంకు వెన‌క్కి త‌గ్గింది.. రీజ‌న్ ఏంటి..?

Update: 2019-07-20 08:17 GMT
గ‌త ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు.. అమరావతిని ప్ర‌తి ష్టాత్మ‌కంగా తీసుకుని, ప్ర‌పంచ దేశాల న‌మూనాల‌ను ప‌రిశీలించి, సింగ‌పూర్ మాదిరిగా రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టిం చారు. అయితే, విభ‌జ‌న క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రంలో అత్యంత సువిశాల రాజ‌ధానిని నిర్మించ‌డం అంటే.. మాట‌లు కాదు.. మ‌నీ కావాలి. అది ఎక్క‌డి నుంచి వ‌స్తుంది?  ఎవ‌రు ఇస్తారు? కష్టమే. అప్పుల మీద ఆధారపడాలి. మిగతా అభివృద్ధి పనులు ఆపాలి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌పంచ బ్యాంకును ఆశ్ర‌యించారు. దాదాపు 9800 కోట్ల రూపాయ‌ల సొమ్మును అప్పుగా కోరారు. దీనికి ప్ర‌పంచ బ్యాంకు ఓకే అంది. అదేస‌మ‌యంలో కేంద్రం కూడా ప‌చ్చ‌జెండా ఊపింది.

తీరా ప్ర‌పంచ బ్యాంకు రుణం ఇచ్చే స‌మ‌యానికి రాజ‌ధాని రైతుల నుంచి కొన్ని ఫిర్యాదులు, విజ్ఞాప‌న‌లు కూడా ప్ర‌పంచ బ్యాంకుకు చేరాయి. ఫ‌లితంగా బ్యాంకు ప్ర‌తినిధి బృందం నేరుగా అమ‌రావ‌తిలో వాలిపోయి.. ప్ర‌తి ఇంటినీ ప‌రిశీ లించింది. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకుంది. త‌మ‌కు తెలుగు రాక‌పోయినా.. తెలుగు వ‌చ్చిన ఓ ప్రొఫెస‌ర్‌ను పెట్టుకుని ఇక్క డి రైతులు, ద‌ళితుల స‌మ‌స్య‌ల‌ను ఇంగ్లీష్‌లోకి త‌ర్జుమా చేయించుకుని ఆల‌కించింది. అనంతరం.. ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట తాము అమ‌రావ‌తికి రుణం ఇవ్వ‌బోమ‌ని ప్ర‌క‌టించింది. ఇదే ఇప్పుడు ఏపీలో రాజ‌కీయ మంట‌లు రేపుతోంది. ప్ర‌తిప‌క్ష‌, అధికార ప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయ వైరానికి కూడా రీజ‌న్‌గా మారింది.

మేం ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణం వ‌చ్చేలా చేస్తే.. అప్ప‌ట్లో విప‌క్షంలో ఉన్న వైసీపీ లేనిపోని ఫిర్యాదులు చేయ‌డంతో పాటు రైతుల‌నుకూడా రెచ్చ‌గొట్టింద‌ని, ఫ‌లితంగా ఇప్పుడు రుణం వెన‌క్కి పోయింద‌ని, దీంతో రాజ‌ధాని నిర్మాణానికి డ‌బ్బులు ఎలా తెస్తార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, వైసీపీ దీనికి భిన్న‌మైన వాద‌న చేస్తోంది. రుణం ఇచ్చేందుకు చంద్ర‌బాబు అనుస‌రించిన మార్గాలే కార‌ణ‌మ‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ‌ధాని రైతుల నుంచి బ‌లవంతంగా భూములు లాక్కోవడం, ద‌ళిత రైతులు, కౌలు రైతుల‌కు అన్యాయం చేయ‌డం వ‌ల్లే ప్ర‌పంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు వెన‌క్కి త‌గ్గింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

అయితే, దీనికి భిన్నంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధి బృందం అమ‌రా వ‌తిలో నిర్మించే ప్రాజెక్టుల‌ను ఇన్ స్పెక్ష‌న్ చేస్తామ‌ని ష‌రతు విధించింద‌ని ఆయ‌న తెలిపారు. అయితే, విదేశీయులు మ‌న దేశంలోని ఒక రాష్ట్రంలో ఇన్ స్పెక్ష‌న్ చేయ‌డానికి అనుమ‌తిస్తే.. దేశానికే ప్ర‌మాద‌ని, ఒక‌ర‌కంగా అవ‌మాన‌క‌ర‌మ‌ని కేంద్రం భావించి, రాష్ట్రాన్ని హెచ్చ‌రించింద‌ని, అందుకే తాము ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధుల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ రెండు వాద‌న‌ల్లో ఏది క‌రెక్టు? అనే చ‌ర్చ స‌రికొత్త‌గా చ‌ర్చ‌కు వ‌చ్చింది.
 
    

Tags:    

Similar News