ట్రంప్ ఉన్నా కూడా... జెలెన్ స్కీకి ఏమి బెదిరింపులు స్వామీ ఇవీ..!

ఓ పక్క రష్యా - ఉక్రెయిన్ మధ్య అవిరామంగా జరుగుతున్న కీలక యుద్ధాన్ని ఆపాలని.. తద్వారా నోబెల్ శాంతి బహుమతికి మరింత చేరువ అవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-31 19:30 GMT

ఓ పక్క రష్యా - ఉక్రెయిన్ మధ్య అవిరామంగా జరుగుతున్న కీలక యుద్ధాన్ని ఆపాలని.. తద్వారా నోబెల్ శాంతి బహుమతికి మరింత చేరువ అవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు పూర్తి భిన్నంగా అన్నట్లుగా మరొవైపు రష్యా, ఉక్రెయిన్ లు ఎవరి స్థాయిలో వాళ్లు ఈ వివాద పరిష్కారాన్ని పక్కదారి పట్టించే పనులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీకి మాస్ వార్నింగ్ వచ్చింది రష్యా నుంచి.

అవును... మరికొన్ని రోజుల్లో డోనాల్డ్ ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ కానున్నారని వార్తలు వచ్చిన తర్వాత ఉక్రెయిన్ పై రష్యా తీవ్ర స్థాయిలో దాడి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్ తో జెలెన్ స్కీ చర్చలు జరుపుతున్న సమయంలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపైకి సుమారు 91 లాంగ్ రేంజ్ డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. దీనిపై ట్రంప్.. ఈ విషయం తెలిసాక తనకు కోపం వచ్చిందని అన్నారు.

మరోవైపు రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా.. పుతిన్ నివాసంపై దాడికి సంబంధిచి రష్యా ఎలాంటి ఆమోదయోగ్యమైన ఆధారాలను సమర్పించలేదని.. సమర్పించరు కూడా అని.. ఎందుకంటే అలాంటి దాడి జరగలేదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహో అన్నారు. ఇదే సమయంలో.. రష్యాకు చాలా కాలంగా తప్పుడు వాదనల విషయంలో గొప్ప రికార్డు ఉందని తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో జెలెన్ స్కీకి రష్యా నుంచి ఓ మాస్ వార్నింగ్ వచ్చింది. రష్యా భద్రతా మండలిలోని ప్రస్తుత సభ్యుడిగా ఉన్న మాజీ రష్యా అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్... ఉక్రెయిన్ నాయకుడు వివాద పరిష్కారాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని.. అతని తీరు చూస్తుంటే యుద్ధాన్ని కోరుకుంటున్నట్లుగా ఉందని.. అదే అయితే.. అతడు తన జీవితాంతం అజ్ఞాతంలో ఉండాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అనంతరం మరింత వాయిస్ పెంచిన దిమిత్రి... జెలెన్ స్కీ కి మరణం దగ్గర పడిందని.. ఆయనను ప్రాణాలతో విడిచిపెట్టబోమని.. ఇక అతను జీవితాంతం దాక్కుని బ్రతకాల్సి వస్తుందని.. అతని అంతం తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో అతన్ని ఓ ప్రదర్శన వస్తువులా ఉంచుతామంటూ తీవ్రంగా స్పందించారు. దీంతో... ఈ హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు.. శాంతి చర్చలు త్వరలో సఫలమయ్యే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News