సారీ చెప్పిన లోకేశ్.. మధ్యాహ్న భోజనంపై షాకింగ్ డెసిషన్

నాసిరకం మధ్యాహ్నం భోజనంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. సంఘటనకు బాధ్యలైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.;

Update: 2026-03-13 09:47 GMT

నాసిరకం మధ్యాహ్నం భోజనంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. సంఘటనకు బాధ్యలైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్న భోజనం నిర్వహణ ఏజెన్సీని తప్పించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు అడుగుతూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలోని తారకరామానగర్ ఎంపీపీ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ ఓ వీడియో వైరల్ అయింది. దీనిని మంత్రి లోకేశ్ కు ట్యాగ్ చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన లోకేశ్ విచారణకు ఆదేశించారు.

గత మంగళవారం మధ్యాహ్న భోజనంలో అన్నం సరిగా ఉడకలేదని, పులిహోరలో ఉప్పు లేదని, ఉడికీ ఉడకని గుడ్లు పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా తమ ప్లేట్లలోని ఆహారాన్ని సామూహికంగా డస్ట్ బిన్ లో వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతోపాటు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మంత్రి లోకేశ్ దృష్టికి వ్యవహారం వెళ్లింది. దీంతో మధ్యాహ్న భోజనంపై విచారణకు 3 మేన్ కమిటీని వేశారు. డీఈవో వై.చంద్రకళ ఆధ్వర్యంలోని బృందం బుధవారం పాఠశాలలో విచారణ జరిపింది.

మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాల్సిన హెచ్ఎం జాన్ తన బాధ్యతలను విస్మరించారని, విద్యార్థులను తప్పుదారి పట్టించి వారితో భోజనం డస్ట్ బిన్ లో వేసి వీడియో తీసి వైరల్ చేశారని డీఈవో గుర్తించినట్లు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. హెచ్ఎం జాన్ దురుద్దేశంతో ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఆలోచనతో వ్యవహరించారని గుర్తించారు. ఈ కారణంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడే ఇలా చేయడం విస్మయానికి గురిచేసిందని అంటున్నారు.

ఇక ఈ అంశంపై మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండటానికి, పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తామని ఎక్స్ లో తెలిపారు. అలాగే 'లీప్' (LEAP) యాప్ ద్వారా తల్లిదండ్రుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు అందడమే మా లక్ష్యం, అది ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు.




Tags:    

Similar News