పుతిన్ పెంపుడు కుక్కలా ట్రంప్? కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం పోస్టు వైరల్

కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఎడిటెడ్ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.;

Update: 2026-03-13 09:50 GMT

అమెరికా రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరోసారి తీవ్ర వివాదం చెలరేగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ కార్యాలయం చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు, రిపబ్లికన్ ,డెమోక్రాటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని తారాస్థాయికి చేర్చింది. ఈ ఘటన అమెరికా రాజకీయాల్లో వ్యంగ్య ప్రచారాల పరిమితులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

వివాదానికి కారణమైన ఆ చిత్రం

కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఎడిటెడ్ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆ చిత్రంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్‌ను ఒక పెంపుడు కుక్కపిల్లలా గొలుసుతో కట్టి నడిపిస్తున్నట్లుగా చిత్రీకరించారు. ఈ చిత్రం ట్రంప్ పట్ల రష్యాకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఎగతాళి చేసేలా ఉందని, ఆయన నిర్ణయాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని సూచించేలా రూపొందించబడింది. ఇది కేవలం ఒక రాజకీయ వ్యంగ్య చిత్రం మాత్రమేనని డెమోక్రాట్లు వాదిస్తుండగా ఇది ఒక రాష్ట్ర స్థాయి గవర్నర్ కార్యాలయం చేయాల్సిన పని కాదని రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చమురు నిర్ణయం చుట్టూ అలుముకున్న చిచ్చు

ఈ వివాదానికి ప్రధాన కారణం ఇటీవలి చమురు సరఫరాకు సంబంధించిన నిర్ణయం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న సమయంలో రష్యన్ ఆయిల్ కొనుగోళ్లకు ఏప్రిల్ 11 వరకు అనుమతినిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల రష్యా ఆర్థికంగా బలపడుతుందని.. ఆ దేశ చమురు అమ్ముకోవడానికి పరోక్షంగా వీలు కల్పిస్తుందని డెమోక్రటిక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ట్రంప్ విధానాలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా రష్యాకు లాభం చేకూర్చేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ ప్రతీకారమా లేక వాక్ స్వాతంత్ర్యమా?

డెమోక్రాట్ల వాదన ప్రకారం, ఇది ట్రంప్ విధానాలను ప్రశ్నించేందుకు ఉపయోగించిన ఒక రాజకీయ వ్యంగ్యం. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి.. ట్రంప్ నిర్ణయాల వెనుక ఉన్న 'నిజ స్వరూపాన్ని' చూపించడానికి ఇలాంటి పద్ధతులు అవసరమని వారు భావిస్తున్నారు.

మరోవైపు రిపబ్లికన్ మద్దతుదారులు దీనిని తప్పుపడుతున్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని.. కానీ ఒక రాష్ట్ర గవర్నర్ కార్యాలయం వ్యక్తిగత దూషణలకు లేదా అవమానకరమైన చిత్రాలకు పాల్పడటం ప్రజాస్వామ్య గౌరవానికి భంగమని వారు మండిపడుతున్నారు. రాజకీయ ప్రచారానికి సోషల్ మీడియాను వాడుకోవడం తప్పు కాకపోయినా అధికారిక హోదాలో ఉన్నవారు ఇలాంటి పద్ధతులను అనుసరించడం అనైతికమని వారు వాదిస్తున్నారు.

అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల నేపథ్యంలో అమెరికా రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. సోషల్ మీడియా ఇప్పుడు ప్రచారానికి ప్రధాన కేంద్రంగా మారడంతో ఇటువంటి వివాదాస్పద పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన రిపబ్లికన్–డెమోక్రటిక్ పార్టీల మధ్య ఉన్న అగాధాన్ని రాజకీయాల్లో పెరిగిన అసహనాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ప్రజాస్వామ్య విలువలు.. రాజకీయ విమర్శల మధ్య సన్నని గీతను ఎలా దాటుతున్నారో చెప్పడానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా మిగిలిపోనుంది.

Tags:    

Similar News