2025 : భారత్ ప్రగతి పథంలో ఒక చారిత్రాత్మక మలుపు
2025వ సంవత్సరం భారతదేశ చరిత్రలో కేవలం ఒక మరో క్యాలెండర్ ఏడాదిగా మిగిలిపోలేదు. ఇది నవ భారత నిర్మాణంలో ఒక బలమైన పునాదిగా మారబోతోంది.;
2025వ సంవత్సరం భారతదేశ చరిత్రలో కేవలం ఒక మరో క్యాలెండర్ ఏడాదిగా మిగిలిపోలేదు. ఇది నవ భారత నిర్మాణంలో ఒక బలమైన పునాదిగా మారబోతోంది. ప్రభుత్వం తీసుకున్న 5 కీలక నిర్ణయాలు సామాన్యుడి జేబు నుంచి దేశ భవిష్యత్తు వరకు అన్నింటినీ ప్రభావితం చేయనున్నాయి. దీనిపై స్పెషల్ స్టోరీ.
కొత్త ఆదాయపు పన్ను చట్టం
మధ్యతరగతి ప్రజల ఏళ్ల నాటి నిరీక్షణకు ఈ ఏడాది తెరపడింది. కొత్త పన్ను చట్టం ద్వారా ప్రభుత్వం పన్ను విధానాన్ని పూర్తిగా సరళీకరించింది. సంక్లిష్టమైన పాత పద్ధతులకు స్వస్తి చెప్పి పన్ను స్లాబ్ లను తగ్గించింది. రిటర్న్ దాఖలు చేయడం ఇప్పుడు మరింత సులభమైనది. అనవసరమైన నోటీసుల వేధింపులు తగ్గనున్నాయి. ఉద్యోగుల చేతిలో మిగిలి ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక ప్రణాళికలో స్పష్టత వస్తుంది.
బిజిఆర్ఏఎం చట్టం గ్రామీణ భారత్ కు కొత్త ఊపిరి
గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను అరికట్టడమే లక్ష్యంగా వచ్చిన బిజిఆర్ఏం భారతీయ గ్రామీణ రోజ్ గార్ అండ్ అసెట్స్ మేనేజ్మెంట్ యాక్ట్ (బిజిఆర్ఏఎం) ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పొచ్చు. ఇందులో ఏడాదికి 125 రోజుల పని దినాలు కల్పిస్తారు. కేవలం తాత్కాలిక పనులే కాకుండా గ్రామాల్లో శాశ్వత రోడ్లు, నీటి వనరులు వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం వల్ల స్థానికంగానే ఉపాధి లభిస్తుంది.
పిఈఏసిఈ బిల్లు : 2025 ఇంధన రంగంలో ప్రైవేటు జోరు..
భారత ఇంధన విధానంలో అత్యంత సాహసోపేతమైన అడుగు ఈ ‘పీస్’ బిల్లు దీని ద్వారా అణు శక్తి ఉత్పత్తిలో ప్రైవేటు పెట్టబడులకు తలుపులు తెరుచుకోనున్నాయి. దీని లక్ష్యం విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం.. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వడం. భవిష్యత్తులో విద్యుత్ ధరలు స్థిరంగా ఉండటంతో పాటు దేశానికి ఎనర్జీ సెక్యూరిటీ లభిస్తుంది.
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ : వేగంగా దూసుకెళ్తున్న భారత్
మౌలిక సదుపాయాల కల్పన అంటే కేవలం రోడ్లు వేయడం కాదు. అది దేశ ఆర్థిక వ్యవస్థకు రక్త ప్రసరణ లాంటిది. సమృద్ధి మహా మార్గ్ పూర్తిస్థాయి అందుబాటులోకి రావడంతో రోడ్ల నిర్మాణం ఊపందుకుంది. నవీన్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం. ముంబై మెట్రో లైన్ 3 ప్రాజెక్టు పట్టాలెక్కడం.. ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి వస్తువుల ధరలు తగ్గుతాయి. దీనివల్ల లక్షలాది మందికి నిర్మాణ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయి.
స్పేస్ పవర్: విశ్వ వీధిలో భారత జయకేతనం
అంతరిక్ష పరిశోధనలో భారత్ ఇప్పుడు అగ్రరాజ్యాలకు గట్టి పోటీని ఇస్తోంది. గగన్ యాన్ లో భారత వ్యోమగాములను అంతరిక్షంలో పంపే ప్రయోగం కీలక దశకు చేరుకుంది. స్పేస్ సెక్టార్లో ప్రైవేటు స్టాటప్ లకు భారీ ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనివల్ల హైటెక్ ఉద్యోగాల సృష్టితోపాటు గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ బాట పెరగనుంది.
ఈ ఐదు నిర్ణయాలు సామాన్యుడికి పన్ను ఊరటను.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను దేశానికి సుస్థిర భవిష్యత్తును అందించబోతున్నాయి. ఇది పుకారు కాదు.. మారుతున్న భారత వేస్తున్న బలమైన అడుగుగా చెప్పొచ్చు.