బాబుకు ఇచ్చిన ట్రీట్ మెంటే కేసీఆర్ కు కూడా..
నాలుగు రోజుల పాటు దిల్లీలో ఉండి ప్రధాని మోదీ సహా పలువురిని కలిసి రావాలని వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ 24 గంటల్లోనే వెనక్కు వచ్చేశారు. అందుకు కారణం మోదీ అపాయింట్ మెంటు దొరక్కపోవడమేనన్నది అంతటా వినిపిస్తున్న మాట. దీంతో ఏపీ సీఎం చంద్రబాబుకు అపాయింటుమెంట్లు ఇవ్వకుండా ఆయన సహనాన్ని పరీక్షించి, అవమానించి మైండ్ గేమ్ ఆడిన మోదీ ఇప్పుడు కేసీఆర్ తోనూ అదే ఆట ఆడుతున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది.
నిజానికి మోదీకి కేసీఆర్ అపాయింటుమెంటు దొరక్కపోవడం ఇదే తొలిసారి కాదు. ఏడాది కిందటా ఒకసారి ఆయనకు చుక్కెదురైంది. అప్పటివరకు ఉన్న దోస్తీని పక్కనపెట్టి కేసీఆర్ కు అప్పుడే నో చెప్పారు మోదీ. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంటు అంటూ కేసీఆర్ కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతుండడంతో మరోసారి షాకిచ్చారు.
ఏడాదిన్నర కిందట 2016 నవంబరులో మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు విమానాశ్రయంలో దిగీదిగగానే కేసీఆర్ భుజం మీద చేయి వేసి పక్కకు తీసుకెళ్లి సుమారు 10 నిమిషాలు అక్కడే మంతనాలు జరిపారు. దీంతో అది చూసి తెలంగాణ బీజేపీ నేతలు సైతం మూతి ముడుచుకున్నారు. టీఆరెస్‌ను ఎలాగైనా ఎన్డీయే కూటమిలోకి లాగాలని బీజేపీ కోరుకున్న రోజులవి. కానీ, ప్రయోజన రాజకీయాల లెక్కలు కుదరక అది జరగకపోవడంతో ఆర్నెళ్లలోనే మోదీ కేసీఆర్‌కు అపాయింటుమెంటు నిరాకరించారు.
2017 మేలో ఎస్సీ వర్గీకరణ విషయమై అఖిల పక్షాన్ని తీసుకెళ్లేందుకు కేసీఆర్ తెలంగాణ సీఎం హోదాలో మోదీ అపాయింటుమెంటు కోరినా దొరకలేదు. ఇప్పుడు జోనల్ విధానం, 9 - 10 షెడ్యూల్ సంస్థల విభజన వంటి అంశాలతో ఆయన దిల్లీ వెళ్లినా ప్రధాని కార్యాలయం నుంచి నిరాకరణ ఎదురైంది. దీంతో చంద్రబాబుతో మైండ్ గేమ్ ఆడినట్లే కేసీఆర్‌తోనూ మోదీ ఆట మొదలుపెట్టారని వినిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కేసీఆర్ చొరవ తీసుకుని ప్రాంతీయ పార్టీలను కదుపుతుండడంతోనే మోదీ ఆగ్రహంగా ఉన్నట్లు టాక్. మరి.. కేసీఆర్ దీనిపై ఎలాంటి పైఎత్తు వేస్తారో చూడాలి.