చోరీ జ‌రిగింది అమ్మ వీలునామా కోస‌మేనా?

Update: 2017-05-03 05:14 GMT
ఇటీవ‌ల కాలంలో దివంగ‌త‌ అమ్మ జ‌య‌ల‌లిత‌కు చెందిన ఆస్తుల మీద జ‌రుగుతున్న దాడుల వెనుక అస‌లు ఉద్దేశం ఏమిటి? అమ్మ గెస్ట్ హౌస్ ల మీద సాగుతున్న దాడుల వెనుక ఉన్న‌ది ఎవ‌రు? ఏ ల‌క్ష్యం కోసం నీల‌గిరి జిల్లా కొడ‌నాడుఎస్టేట్ బంగ‌ళాలో దోపిడీ య‌త్నం జ‌రిగింది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల సంచ‌ల‌నం సృష్టించిన కొడ‌నాడు ఎస్టేట్ బంగ‌ళాలో జ‌రిగిన దోపిడీ య‌త్నానికి సంబంధించి నిందితుడు స‌యాన‌ను.. కేర‌ళ మాంత్రికుడ్ని.. హ‌వాలా ఏజెంట్ మ‌నోజ్ స‌హా మ‌రో ప‌ది మంది అరెస్ట్ కావ‌టం తెలిసిందే. వీరిని ప‌లు ర‌కాలుగా విచారించిన పోలీసులు కొడ‌నాడు గెస్ట్ హౌస్ పై దాడికి సంబంధించి ఒక ప్రాధ‌మిక అంచ‌నాకువ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

వంద మంది వ‌ర‌కూ గూర్ఖాలున్న కొడ‌నాడు గెస్ట్ హౌస్ లో జ‌రిగిన దాడి వెనుక పెద్ద కుట్ర ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. గ‌త ఏప్రిల్ 23న మూడుకార్ల‌లో వెళ్లిన ప‌ద‌కొండు మంది దోపిడీ దొంగ‌లు.. గెస్ట్ మౌస్ 11 గేట్ నెంబ‌రు వ‌ద్ద విధులు నిర్వ‌ర్తిస్తున్న ఓం బ‌హ‌దూర్‌.. కృష్ణ బ‌హ‌దూర్ ల‌పై క‌త్తుల‌తో దాడి చేయ‌టం.. ఈ ఉదంతంలో ఓంబ‌హ‌దూర్ మ‌ర‌ణించ‌గా..కృష్ణ బ‌హూదూర్ తీవ్రంగా గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే.

ఈ దాడి వెనుక అస‌లు ఉద్దేశం వేర‌ని చెబుతున్నారు. అమ్మ త‌న ఆస్తుల‌కు సంబంధించిన వీలునామాను ఈ గెస్ట్ హౌస్ లోనే ఉంచిన‌ట్లుగా చెబుతున్నారు. పేప‌ర్‌.. సీడీల రూపంలో ఉన్న ఈ వీలునామాను చేజిక్కించుకునేందుకే దోపిడీ య‌త్నం జ‌రిగింద‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు.

దోపీడి వెనుక కేర‌ళ కిరాయి గూండాలు ఉన్న‌ట్లుగా ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేలిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ దోపిడీకి జ‌య‌ల‌లిత మాజీ కారుడ్రైవ‌ర్ క‌న‌క‌రాజ్ ఉన్నాడ‌ని చెబుతున్నారు. అయితే.. అత‌గాడు సేలం స‌మీపంలో అత్తూరు వ‌ద్ద  జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టం విశేషం.ఇక‌.. అమ్మ వీలునామాలో ఏముంద‌న్న విష‌యానికి వ‌స్తే.. త‌న ఆస్తుల్లో అధిక భాగాన్ని ధార్మిక సంస్థ‌ల‌కు దానం ఇవ్వాల‌న్న విష‌యాన్ని జ‌య‌ల‌లిత పేర్కొన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పోలీసుల అదుపులో ఉన్న కేర‌ళ మాంత్రికుడు.. ఇత‌రులు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం.. కోడ‌నాడు గెస్ట్ హౌస్ లో చేసి దాడిలో విలువైన వ‌స్తువుల‌తో పాటు.. వీలునామా ఉన్న సూట్ కేసు కూడా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. తాము వీలునామా కోసం దొంగ‌త‌నం చేయ‌లేద‌ని.. విలువైన వ‌స్తువుల కోస‌మే దోపిడీ య‌త్నానికి పాల్ప‌డిన‌ట్లుగా చెప్పిన‌ట్లుగా స‌మాచారం. దీనికి సంబంధించి అధికారిక స‌మాచారం వెలువ‌డాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News