ఆ సీఈవో వాఖ్యల్లో విషం...విద్వేషం
హెచ్1బీ వీసాదారులు...అందులోనూ భారతీయ ఉద్యోగులపై అమెరికా పోల్ స్టర్, రాజకీయ వ్యాఖ్యాత మార్క్ మిచెల్ విషపూరిత వ్యాఖ్యలు చేయడం ఇపుడు సంచలనంగా మారుతోంది.;
హెచ్1బీ వీసాదారులు...అందులోనూ భారతీయ ఉద్యోగులపై అమెరికా పోల్ స్టర్, రాజకీయ వ్యాఖ్యాత మార్క్ మిచెల్ విషపూరిత వ్యాఖ్యలు చేయడం ఇపుడు సంచలనంగా మారుతోంది. హెచ్1బీ వీసాపై వచ్చిన ఉద్యోగులు అక్రమ వలసదారులతో సమానమని దారుణంగా కామెంట్ చేయడం వారి విద్వేషానికి పరాకాష్టగా నిలుస్తోంది. వీసాపై వచ్చిన వారి చట్టబద్ద అస్థిత్వాన్ని అక్రమ వలసదారులతో బేరీజు వేయడం నిజంగా వారి సంకుచిత మనస్తత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.
డిమాండ్ ఉన్న చోటే సప్లయి ఉంటుంది. అవసరం ఉన్న చోటే ఆశావహుల ఆగమనం ఉంటుంది. ఇది ప్రకృతి సహజ న్యాయ సూత్రం. కానీ అవకాశాలను వెదుక్కొంటూ...తమ మేధో సంపత్తును ధారాదత్తం చేస్తూ ఎందరో ఇండియన్లు దశాబ్దాలుగా అమెరికాకు వెళుతున్నారు...అక్కడే స్థిరపడుతున్నారు. ఆదేశాభివృద్ధిలో కీలక భాగస్వాములవుతున్నారు. ఆ దేశాదాయానికి టాక్స్ రూపంగా తమ జీతం నుంచి సొమ్ము చెల్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వలస వచ్చిన వారిని బానిసలుగా, అమెరికా విద్రోహులుగా...వారి వల్లనే అమెరికన్లు లూటీ అవుతున్నారని భావించడం నిజంగా మూర్ఖత్వం. వాస్తవానికి ఈ మేధో వలసకు బాధపడాల్సింది భారత్. ఈ గడ్డపై పుట్టిపెరిగి...మేధావులుగా ఎదుగుతున్న వారు అవతలి దేశానికి అమూల్య సేవలందిస్తూ...ఆ దేశ ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నారని భారత్ మదనపడుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇండియా అంటూ నినదించారు.
హెచ్1బీ వీసాలపై వచ్చిన వారిని విమర్శించినంత మాత్రాన...వారిపై విషం చిమ్మినంత మాత్రాన అమెరికా ప్రగతి పథంలో దూసుకెళుతుందా...అసలు ఆ దేశంలో తెలివైన వాళ్ళుంటే...ఇతర దేశాల వారికి అవకాశాలే రావు కదా. మరి ట్రంప్...వారి అధికారయంత్రాంగం ఇంతచిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో అర్థం కాదు. అమెరికాలో అవకాశాలు అద్భుతంగా ఉంటాయి...జీతం డాలర్లలో ఉంటుంది...జీవితం ప్రశాంతంగా గడచిపోతుంది...ఇవన్నీ నిజాలే. భారతీయులు వచ్చేది కేవలం ఇందుకోసమే కదా. అంతమాత్రాన వారిని హీనంగా చూడ్డం మానవీయ విలువల్ని ఉల్లంఘించడమే కాదా.
సిలికాన్ శ్రామికుల్లో మూడింట రెండొంతులు విదేశీయులే ఉన్నారు. కొన్ని సంస్థల్లో 90 శాతంమంది భారతీయుల్నే నియమించుకున్నారని మార్క్ మిచెల్ తమ వ్యాఖ్యానంలో ప్రస్తావించారు. మార్క్ అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ రాస్ ముస్సేన్ కు సీఈవోగా ఉంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ నిర్వహించిన కార్యక్రమంలో మార్క్ ఒక హెచ్1 బీ ఉద్యోగి పది మంది అక్రమ వలసదారులతో సమానమని వ్యాఖ్యానించారు. అయితే వారు గమనించాల్సిన అంశం ఏంటంటే...ఏ కంపెనీ కూడా ఉత్తిపుణ్యానికే విదేశీయుల్ని ఉద్యోగులుగా నియమించదు. తక్కువ వేతనం...అధిక పని...అపారమైన మేధోసంపదను పంచగల శక్తి ఉన్నవారికే మొదటి ప్రాధాన్యమిస్తాయి.
యాపిల్ వంటి టెక్ దిగ్గజ సంస్థల్లో పనిచేసే హెచ్1బీ ఉద్యోగి పదిమంది అక్రమ వలసదారులతో సమానమని మార్క్ అన్నారు. తక్కువ వేతనాలతో పనిచేసే కార్మికులపై సిలికాన్ వ్యాలీ కంపెనీలు ఆధారపడుతున్నాయి. హెచ్ 1బీ వీసాల ద్వారా తక్కువ వేతనానికి వచ్చే థర్డ్ వరల్డ్ ఇంజనీర్లను అమెరికన్ల స్థానంలో తీసుకొస్తున్నాయి. భారీ సొమ్మును కంపెనీలు వెనకేసుకుంటున్నాయి. ఇదో దోపిడీ అని మార్క్ ఘాటుగా విమర్శించారు. వీరి ప్రసంగంలో ఆవేదన ఉండొచ్చు. కంపెనీల విధానంపై ఆగ్రహం ఉండొచ్చు. కానీ వీసాపై వచ్చిన వారిని అక్రమవలసదారులతో పోల్చడమే బాధాకరం.
2025 ఇండస్ట్రీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం సిలికాన్ వ్యాలీలో 66 శాతం టెక్ ఉద్యోగుల్లో విదేశీయులే ఉన్నారు. వారిలో 23 శాతం మంది భారతీయులు, 18శాతం మంది చైనా దేశీయులున్నట్లు తెలుస్తోంది అందుకే మార్క్ స్పందన ఇంత తీవ్రంగా ఉంది. ఈ లెక్కన అమెరికా కంపెనీలు భారతీయుల్నే ఎంచుకుంటున్నాయంటే....స్థానికులు ఏస్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారో స్వ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీలకు చివరంటా కావల్సింది...తమ కంపెనీని లాబాల బాట పట్టించే ఉద్యోగులు మాత్రమే. ఇది పక్కా వాణిజ్య సూత్రం. ఏ దేశమైనా దీనికి మినహాయింపు కాదు. ఒకవేళ స్థానికులకు అవకాశాలు తగ్తుతుంటే రిజర్వేషన్ ...తొలి ప్రాధాన్యం లాంటి డిమాండ్లు తెరపైకి తీసుకురావచ్చు. అది సబబు కూడా.