విద్యుత్ అంతరాయాలకు..విద్యుదుత్పత్తిలో లోటే కారణం!

Update: 2019-09-30 15:34 GMT
నవ్యాంధ్రకు నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రాష్ట్రంలో దుబారాకు చెక్ పెట్టడంతో పాటుగా... గత ప్రభుత్వం తన అనుకూలురకు భారీ లబ్ధి చేకూరేలా చేసిన ఒప్పందాలపై సమీక్షలు చేస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లపై జగన్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇదే జరిగితే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు - ఆయన అనుయాయులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయారు. అలాంటి సమయంలో వారికి విద్యుత్ కోతలు ఓ అస్త్రంగా దొరికాయనే చెప్పాలి. రాష్ట్రంలో విద్యుత్ లోటు కారణంగా గత వారంలో  ఓ రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ కు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇదే అదనుగా టీడీపీ శిబిరం... జగన్ సర్కారుపై ఎదురు దాడి మొదలెట్టేసింది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగానే రాష్ట్రం అంధకారంలో మునిగిపోయే ప్రమాదం నెలకొందని తమదైన శైలి వాదనలతో విరుచుకుపడింది.

అయితే ఈ వాదనలు - నిందారోపణలు పూర్తిగా అవాస్తవమని - విద్యుత్ అంతరాయాలకు అసలు కారణాలు వేరేగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో విద్యుత్ సరఫరా బాధ్యతలను నిర్వర్తిస్తున్న సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) ఓ సుదీర్ఘ వివరణను చాలా స్పష్టంగా విడుదల చేసింది. నిన్న విడుదలైన ఈ ప్రకటన ప్రకారం... రాష్ట్రంలో బొగ్గు ఆధారంగా జరిగే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ లోటు దాదాపుగా 1100 మెగావాట్ల మేర ఉంది. ఇంత మేర ఉత్పత్తి లోటు రావడంతోనే రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలు అనివార్యంగా ఏర్పడ్డాయని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్. హరనాథరావు సదరు ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తి తగ్గడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ఒడిశాలోని మహానది కోల్ ఫీల్డ్ లో సిబ్బంది సమ్మె కారణంగా అక్కడి నుంచి రాష్ట్రంలోని థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థలకు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని - అదే సమయంలో భారీ వర్షాల కారణంగా సింగరేణి - తాల్చేరు బొగ్గు గనుల్లో బొగ్గు వెలికి తీయడం సాధ్యం కావడం లేదని ఆయన వివరించారు. మూడు ప్రధాన బొగ్గు గనుల నుంచి రాష్ట్రానికి ఒకే సారిగా బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు అవసరమైన మేర బొగ్గు సరఫరా కావడం లేదని కూడా ఆయన వివరించారు.

బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుదుత్పత్తి తగ్గిన సమయంలోనే విండ్ - సోలార్ విద్యుదుత్పత్తిలోనూ సాయంత్రం వేళల్లో అనుకున్న మేర విద్యుదుత్పత్తి జరగడం లేదని కూడా హరనాథరావు చెప్పుకొచ్చారు. ఇటు థర్మల్... అటు విండ్ - సోలార్ విద్యుదుత్పత్తతి ఒకేసారి పడిపోవడంతో రాష్ట్రంలో 1100 మెగా వాట్ల విద్యుదుత్పత్తి లోటు ఏర్పడిందని ఆయన వివరించారు. అయితే జలవిద్యుదుత్పత్తిని వీలయినంతమేర ఉత్పత్తి చేస్తున్నా... మిగిలిన మూడు రంగాల్లో విద్యుదుత్పత్తి పడిపోవడంతోనే భారీ లోటు ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. ఒకేసారి 1100 మెగావాట్ల విద్యుత్ లోటు అంటే సాధారణ విషయం కాదని - ఈ క్రమంలోనే గడచిన వారంలో రెండు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయాలు కలిగాయని - ఈ కొరత తీరే దాకా కొంత మేర ఈ తరహా అంతరాయాలు కలగక తప్పవని, వాస్తవ పరిస్థితులను గమనించి వినియోగదారులు తమకు సహకరించాలని కూడా ఆయన సదరు ప్రకటనలో కోరారు. మొత్తంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అంతరాయాలకు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతమాత్రం కారణం కాదని - అనుకోకుండా ఏర్పడ్డ బొగ్గు కొరత - దానికనుగుణంగానే తగ్గిన విద్యుదుత్పత్తిలే కారణమని హరనాధరావు వివరించారు.

Tags:    

Similar News