కోడెలకు నివాళి అర్పించేందుకు అర్థరాత్రి బాబు రావటమా?

Update: 2019-09-17 05:18 GMT
గతంలో తొమ్మిదిన్నరేళ్ల ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బాబు జమానా గురించి కాసేపు వదిలేద్దాం. మొన్నీ మధ్యన ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా పాలించిన బాబు హయాం గురించి కాస్త గుర్తు తెచ్చుకుందాం. అప్పుడు విషయం పూర్తిగా అర్థం కావటమే కాదు.. బాబు తీరు మరింత బాగా అర్థమయ్యే వీలుంటుంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు కాలు కదిపితే చాలు.. ప్రత్యేక విమానాన్నిఇష్టారాజ్యంగా వాడేసేవారు. ఆయన ఉండే అవరావతి నుంచి తన కుటుంబం ఉండే హైదరాబాద్ కు వచ్చినా ప్రత్యేక విమానాన్ని వదలని చంద్రబాబు.. ప్రజల మీద పడే భారాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. చివరకు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించే మోజు బాబులో ఎంత ఎక్కువైందంటే.. విదేశీ పర్యటనలకు కూడా ప్రత్యేక విమానంలో వెళ్లే వరకూ వెళ్లటాన్ని మర్చిపోలేం.

అలాంటి బాబు.. తాజాగా కోడెల బలవన్మరణం నేపథ్యంలో బెజవాడ నుంచి హైదరాబాద్ కు రావటానికి దగ్గర దగ్గర అర్థరాత్రి వరకూ టైం ఎందుకు పట్టిందన్నది ప్రశ్న. కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా.. లేదంటే అనుమానాస్పదంగా మరణించారన్న విషయాన్ని ప్రపంచ ప్రజలకు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలిసింది. ఆయన ఉరి వేసుకున్న విషయాన్ని ఇంట్లో వారు ఉదయం 10.30 గంటల్లో చూసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమనుకున్నా.. ఈ విషాదాన్ని మొదట పంచుకునే వ్యక్తుల్లో బాబు ఒకరు. అంటే.. దగ్గర దగ్గర 11 గంటల సమయానికి ఆయనకు ఈ విషయం తెలిసి ఉంటుంది.

అలాంటప్పుడు రాత్రి 11 గంటలకు కాని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి చేరుకోలేకపోవటానికి కారణం ఏమిటి? అన్నది క్వశ్చన్. అలా అని బాబేమీ విదేశాల్లో లేరు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఈ లెక్కన చూసుకున్న విషయం తెలిసిన వెంటనే బయలుదేరినా సాయంత్రానికో.. లేదంటే రాత్రి ఏడు గంటల సమయానికి చేరుకునే అవకాశం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా అర్థరాత్రికి కాస్త దగ్గరగా కానీ బాబుకు రావటానికి కుదర్లేదా? అన్నది ప్రశ్న.

అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనంతో ప్రత్యేక విమానంలో ప్రయాణించిన ఆయన.. తనకు అత్యంత సన్నిహితులు.. పార్టీ సీనియర్ నేత అయిన కోడెల లాంటి వారు విషాదకర రీతిలో ఉరి వేసుకొని చనిపోయిన ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక విమానంలో హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకోవాల్సింది పోయి.. రోడ్డు మార్గంలో ప్రయాణించి ఆలస్యంగా రావటంలో అర్థముందా? అన్న ప్రశ్నను చూసినప్పుడు బాబు మాటలకు.. చేతలకు మధ్య తేడా ఇట్టే తెలుస్తుందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News